తెలంగాణలో కొత్త రేషన్ కార్డులకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిందనే వార్తపై రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పందించారు. సోషల్ మీడియాలో ఈ నెల 21 నుంచి కొత్త రేషన్ కార్డులకు సంబంధించి దరఖాస్తులు ప్రారంభం అవుతాయని వస్తున్న వార్తలు అవాస్తవమన్నారు. అవన్ని తప్పుడు వార్తలని, ప్రజలు వాటిని నమ్మొదన్నారు. అలాంటి వార్తలను ఎవరూ షేర్ చేయవద్దని మంత్రి సూచించారు.
కాగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇవ్వనున్నట్లు వాట్సప్, ఫేస్‌బుక్‌తో పాటు ఇతర సోషల్ మీడియాలో వార్తలు చెక్కర్లు కొట్టాయి. దీంతో పలువురు ప్రభుత్వ సైట్లో సైతం దీనిపై సెర్చ్ చేశారు. ఈ వార్తను కొందరు నమ్మలేదు. కానీ దీనిపై సీఎంతో పాటు మంత్రుల ఫొటోలు ఉండటంతో నమ్మక తప్పలేదు.
కాగా ఈ ఫేక్ పోస్టర్‌లో కొత్త రేషన్ కార్డు దరఖాస్తుకు ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో, చిరునామా రుజువు పత్రం, ఇన్‌కం సర్టిఫికేట్ కావాలని పోస్టర్‌లో వివరించారు. దీనికి సంబంధించిన దరఖాస్తును జిల్లా రేషన్ కార్డ్ కార్యాలయంలో ఇవ్వాలని పేర్కొన్నారు.