vijayawada: ఏపీలో ప్రస్తుతం ఫ్యాన్ కి ఎదురుగాలి వీస్తోంది. తమ సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తీవ్ర ఆవేదన చెందిన రాష్ట్ర సర్పంచుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు చిలకలపూడి పాపారావు, కార్యదర్శి నరేంద్రబాబు వైసీపీకి రాజీనామా చేశారు. సర్పంచుల పట్ల ప్రభుత్వ తీరుకు నిరసనగా రాజీనామా చేసినట్లు వెల్లడించారు. విజయవాడలోని ఓ హోటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో అధికార పార్టీకి రాజీనామ చేసినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా రాష్ట్ర సర్పంచుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు చిలకలపూడి పాపారావు మాట్లాడారు. సర్పంచుల సమస్యలపై ఎన్నోసార్లు పీఆర్ మంత్రి, అధికారులను కలిశానని..తమ గోడును విన్నవించుకునేందుకు సీఎం అపాయింట్ మెంట్ కోసం ఎన్నీ సార్లు తిరిగిన ఫలితం కనిపించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.15 శాతం నిధులు మాకు తెలియకుండా దారి మళ్లీంచారని ఆరోపించారు. ప్రజలకు సేవ చేద్దామని, ఊరికేదో ఉపకారం చేద్దామని ఎన్నో ఆశలతో సర్పంచ్ గా గెలిస్తే వైసీపీ ప్రభుత్వం కనీసం విలువ ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం మా సమస్యలు వినేందుకు కూడా సిద్దంగా లేదని అర్ధమైందన్నారు. సర్పంచ్ వ్యవస్థకు సమాంతరంగా వాలంటరీ వ్యవస్థను తెచ్చారు ఇదేం న్యాయం? అంటూ ప్రశ్నించారు. ఎందరో సర్పంచులు ఈ ఆవేదన భరించలేక ఆత్మహత్యలు చేసుకున్నారని వాపోయారు. వైసీపీ ప్రభుత్వం సర్పంచుల వ్యవస్థను డమ్మీగా మార్చిందని మండిపడ్డారు. కేవలం ప్రభుత్వ తీరుకు నిరసనగా వైసీపీకీ రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఇంకా చాలా మంది సర్పంచులు వైసీపీకీ రాజీనామా చేసే అవకాశం ఉందని వ్యాఖ్యనించారు.
త్వరలో జనసేన పార్టీలో చేరుతామని వెల్లడించారు రాష్ట్ర సర్పంచుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు చిలకలపూడి పాపారావు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సిద్దాంతాలు నచ్చాయని తెలిపారు. పవన్ తాను సినిమా కోసం కష్టపడి సంపాధించిన డబ్బును పేద ప్రజలకు ఇవ్వడం గొప్ప విషయం అని కొనియాడారు. జనసేన పార్టీలో పదవి ఆశించి వెల్లడం లేదని.. ప్రజల కోసం పవన్ కళ్యాణ్ పోరాడే విధానం నచ్చి ఆ పార్టీలోకి వెళ్లుతున్నట్లు చెప్పారు.