AP Politics: చంద్రబాబు యాక్షన్ స్టార్ట్.. నెక్ట్స్ అరెస్ట్ అయ్యే వైసీపీ నేతలు వారేనా?

ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం అరెస్టుల పర్వం నడుస్తోంది. చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విదేశాలకు వెళ్లకూడదన్న షరతులతో విడిచిపెట్టారు. ఈ నేపథ్యంలో తరువాత అరెస్ట్ ఎవరిదీ ఉంటుంది అనేదానిపై ఏపీలో చర్చలు గట్టిగా నడుస్తున్నాయి. 

New Update
AP Politics: చంద్రబాబు యాక్షన్ స్టార్ట్.. నెక్ట్స్ అరెస్ట్ అయ్యే వైసీపీ నేతలు వారేనా?

AP Politics: ఏపీరాజకీయాలు ఇప్పుడు అరెస్టుల చుట్టూ తిరుగుతున్నాయి. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో జరిగిన తప్పులపై దృష్టి పెట్టిన టీడీపీ సర్కార్ ప్రతి అంశాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తూనే.. రాజకీయంగా కూడా ఎవరినీ విడిచిపెట్టకుండా ఉండేలా ప్లాన్ చేసినట్టు కనిపిస్తోంది. వైసీపీలో జగన్ కోటరీలో ముఖ్యులుగా చెప్పుకునే ఆ ముగ్గురిపైనే ప్రస్తుతం గట్టిగ ఫోకస్ చేసినట్టుగా ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. ఇదేమీ ఊరికే అలా అనుకోవడం లేదనీ.. జరుగుతున్న సంఘటనలు చూస్తే విషయం అర్ధం అయిపోతుందని వారంటున్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు మోహిత్ రెడ్డిని పోలీసులు నిన్న బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు. అక్కడ నుంచి తీసుకువచ్చిన తరువాత రాత్రంతా విచారించి ఆయనను ఉదయం విడుదల చేశారు. అయితే, విదేశాలకు వెళ్ళడానికి వీలు లేదని షరతును విధించారు. ఈ అరెస్ట్ ఒకవిధంగా కలకలం రేపింది. ఎందుకంటే, మోహిత్ రెడ్డి ఈ కేసులో 37వ నిందితుడిగా ఉన్నారు. మిగిలిన వారికంటే కూడా మోహిత్ రెడ్డిమీదే పోలీసులు ఫోకస్ చేయడం ఇప్పుడు చర్చను లేపింది. నెక్స్ట్ ఎవరు అనే కోణంలో ఏపీ రాజకీయాల్లో చర్చ మొదలైంది. 

AP Politics: చంద్రబాబు నాయుడు ఫోకస్ లో  చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నారని చెప్పుకుంటున్నారు. వీరంతా గత ప్రభుత్వంలో చంద్రబాబును, తెలుగుదేశం పార్టీ నాయకులను టార్గెట్ చేసిన వారే. రాజకీయాల కంటే కూడా వ్యక్తిగతంగా తెలుగుదేశం పార్టీలోని నాయకులను వీరు హింసించారని చెబుతారు. పెద్దిరెడ్డికి, చంద్రబాబుకు మధ్య చాలా వివాదాలు ఉన్నాయి.  అది అలా ఉంచితే, అధికారంలో ఉన్నపుడు పెద్దిరెడ్డి చాలా అక్రమాలు చేశారని ఫిర్యాదులు వెల్లువెత్తాయి. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. ఇది పెదిరెడ్డి అక్రమాలను కప్పి పెట్టడానికే అనే చర్చ నడుస్తోంది. మరోవైపు భూ కుంభకోణాల్లో పెద్దిరెడ్డి పేరు గట్టిగా వినిపిస్తోంది. ఈ విషయాలను టీడీపీ సోషల్ మీడియా బాగా ప్రచారం చేస్తోంది. దీంతో నెక్స్ట్ ఫోకస్ పెద్దిరెడ్డి మీదే ఉందని పొలిటికల్ సర్కిల్స్ లో చెప్పుకుంటున్నారు. 

AP Politics: ఇక పెద్దిరెడ్డి తరువాత టీడీపీ రెడ్ బుక్ లో సజ్జల రామకృష్ణారెడ్డి పేరు వినిపిస్తోంది. అసలు మొత్తం వైసీపీ నాయకులందరి కంటే, సజ్జల పైనే ఎక్కువ ఫోకస్ ఉండే పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే, వైసీపీలో అనధికారికంగా నెంబర్ టూ గా వ్యవహరించారు సజ్జల. సకల శాఖామంత్రిగా ప్రతిపక్షాలు ఆయనను ఎద్దేవా చేస్తూ ఉండేవి. మాజీముఖ్యమంత్రి జగన్ ఎప్పుడూ మీడియా ముందుకు రాలేదు. ప్రతి విషయానికి సజ్జల ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మరీ తెలుగుదేశం, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లను ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవారున్నారనే ఆరోపణలున్నాయి. అంతేకాకుండా అచ్చెయ్యనాయుడు, అయ్యన్న పాత్రుడు, చంద్రబాబు నాయుడుల పై సీఐడీ కేసులను పెట్టించడంలో కూడా సజ్జల ప్రముఖ పాత్ర పోషించారని టీడీపీ వర్గాలు అనుకుంటున్నాయి. మరోవైపు సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు భార్గవ్ రెడ్డి వైసీపీ సోషల్ మీడియా వ్యవహారాలు మొత్తం చూసేవారు. ఆయన సోషల్ మీడియాలో వ్యక్తిగత దూషణలు.. టీడీపీని, జనసేనానిని టార్గెట్ చేస్తూ విపరీతమైన ప్రచారం జరిపించారని చెప్పుకునేవారు. దీంతో ఈ ఇద్దరిపైనే గట్టి టార్గెట్ టీడీపీ ప్రభుత్వానికి ఉందనేది రాజకీయ పరిశీలకుల భావన. ఈ విషయంలో ఇప్పటికే సోషల్ మీడియాలో ఎవరైనా సరే తప్పుడు విధంగా ప్రవర్తిస్తే ఊరుకునేది లేదంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటన కూడా చేశారు. అదేవిధంగా వైసీపీ ప్రభుత్వ హయాంలో చక్రం తిప్పిన సజ్జల కుటుంబం ఎక్కడెక్కడ అవకతవకలకు పాల్పడింది అనే అంశంపై గట్టిగానే కూపీ లాగుతున్నట్టు చెప్పుకుంటున్నారు. ప్రతి విషయాన్నీ నిశితంగా పరిశీలించి.. ఎక్కడ దొరికినా సజ్జల రామకృష్ణా రెడ్డి, భార్గవ్ రెడ్డిలను అరెస్ట్ చేయడానికి సిద్ధం అవుతున్నారని చెప్పుకుంటున్నారు. 

AP Politics: మొత్తంమీద చూసుకుంటే.. వైసిపీ ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండ చూసుకుని విచ్చలవిడిగా ప్రవర్తించిన వారందరికీ రాబోయే రోజుల్లో ఇబ్బందులు తప్పే పరిస్థితి కనిపించడం లేదు. వాటిని రాజకీయంగా ఎదుర్కోవడం కోసమే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ఆందోళన నిర్వహించి.. దేశంలోని ఇతర పార్టీల మద్దతు కోసం ప్రయత్నించారని చెప్పుకుంటున్నారు. ఏ చిన్న విషయం జరిగినా దానిని రాజకీయ కోణంలోనే ఎదుర్కోవాలనేది జగన్ వ్యూహంగా కనిపిస్తోందని పరిశీలకుల భావన. అంతేకాదు, రాబోయే రోజుల్లో తన వారిని కాపాడుకోవడం కోసం గట్టి ప్రయత్నాలు జగన్ చేస్తున్నారనే చర్చ ఏపీలో గట్టిగా నడుస్తోంది.

Advertisment
తాజా కథనాలు