AP Police Jobs: కానిస్టేబుల్ అభ్యర్థులకు ఏపీ కూటమి ప్రభుత్వం మరో రెండు రోజుల్లో శుభవార్త చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. వైసీపీ హయాంలో అర్ధంతరంగా ఆగిపోయిన కానిస్టేబుల్ ఉద్యోగ నియామక ప్రక్రియను పూర్తి చేసేందుకు కసరత్తులు మొదలుపెట్టింది. కోర్టులో పెండింగ్ లో ఉన్న కేసులను క్లియర్ చేసి వెంటనే దీనిపై కార్యాచరణ చేపట్టాలని చంద్రబాబు సర్కార్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సెప్టెంబర్ ఫస్ట్ లోపే నియామక ప్రక్రియ షెడ్యూల్ విడుదల చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ అంశంపై ఇప్పటికే డీజీపీ ద్వారకా తిరుమలరావు, పోలీసు నియామక మండలి ఛైర్మన్ పీహెచ్‌డీ రామకృష్ణ సమీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే.
ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా ఆగిన రిక్రూట్ మెంట్..
ఈ మేరకు 2022 నవంబరు 28న 6,100 పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. జనవరి 22న జరిగిన ప్రిలిమినరీ పరీక్షకు 4,58,219 మంది హాజరయ్యారు. 2023 ఫిబ్రవరి 5న ఈ ఫలితాలు వెల్లడించగా 95,209 మంది అభ్యర్ధులు ఎంపికయ్యారు. 77,876 మంది పురుషులు, 17,332 మంది మహిళలుండగా.. ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్, ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్‌లు నిర్వహించబోతున్నట్లు ప్రకటించారు. హాల్ టికెట్లు సైతం విడుదల చేసినప్పటికీ.. ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా రిక్రూట్ మెంట్ ఆపేశారు. ఆ తర్వాత పోస్టుల భర్తీ వాయిదా పడుతూనే ఉంది. అయితే తాజాగా చంద్రబాబు సర్కార్ త్వరలోనే ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు ప్లాన్ చేస్తోంది. మరో రెండు మూడు రోజుల్లో ఫిజికల్ టెస్టులకు సంబంధించిన షెడ్యూల్ రిలీజ్ చేయబోతున్నట్లు సన్నిహిత వర్గాల సమాచారం.