ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్ట్ పై మంత్రి రోజా మరో సారి తీవ్ర వాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడిది అక్రమ అరెస్టు అని నిరూపించుకోలేని స్థితిలో టిడిపి ఉందన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశంపై సమాధానం చెప్పలేక బాయ్ కాట్ పేరుతో టీడీపీ నేతలు వెనుతిరిగారని ఎద్దేవా చేశారు రోజా. లోకేష్ ట్వీట్ పై సైతం రోజా స్పందించారు. లోకేష్ ధనదాహంతోనే చంద్రబాబు అవినీతి బాట పట్టారని తీవ్ర ఆరోపణలు చేశారు. సీఎంగా ప్రజాభివృద్ధి పక్కనపెట్టి అవినీతి అజెండాగా పరిపాలన సాగించిన వ్యక్తి చంద్రబాబు అని నిప్పులు చెరిగారు. రానున్న ఎన్నికల్లో ఏ పార్టీతోనూ వైసీపీ పొత్తు పెట్టుకోదని స్పష్టం చేశారు.
ప్రజాశ్రేయస్సు కోసమే సీఎం జగన్ కేంద్రంతో సత్సంబంధాలను సీఎం జగన్ కొనసాగిస్తున్నారన్నారు. ముందస్తు ఎన్నికలకు వైసీపీ ఎల్లవేళలా సిద్ధంగా ఉందని ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికలు రెండుసార్లు నిర్వహించడం కంటే ఒకేసారి జరగడం ఉత్తమమన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే వ్యక్తి నగరి టీడీపీ ఇన్జార్జ్ గాలి భాను ప్రకాష్ నాయుడని ధ్వజమెత్తారు. దమ్ముంటే ఆయన తన ఆస్తి వివరాలు తో రావాలని.. తిరుమలలో లేదా శ్రీకాళహస్తిలో అయినా ప్రమాణం చేయడానికి తాను సిద్ధమన్నారు రోజా.