Peddireddy Ramachandra Reddy started Pollution Control board regional office: వైపీపీ ప్రభుత్వం వచ్చాక కాలుష్య కారక వ్యర్థాల నియంత్రణలో చర్యలు చేపడుతుందని పేర్కొన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. శనివారం తిరుపతిలో మంత్రి పెద్దిరెడ్డి పొల్యుషన్ కంట్రోల్ బోర్డు రీజనల్ ఆఫీస్ & ల్యాబరేటరిని ప్రారంభించారు. ఈ భవనానికి డాక్టర్ వైఎస్సార్ పర్యావరణ భవనంగా నామకరణం చేశారు. రూ.16.50 కోట్లతో ఈ నూతన భవనాన్ని నిర్మించారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. సీఎం జగన్ పర్యావరణంపై ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని మార్పులు తెచ్చారన్నారు. కొత్త పరిశ్రమలను పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్నారని కొనియాడారు. తిరుపతిలో సొంత భవనాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు.
వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాలుష్య కారక వ్యర్థాల నియంత్రణలో చర్యలు చేపట్టామని మంత్రి పెద్దిరెడ్డి పేర్కొన్నారు. తిరుపతిలో ప్రారంభించిన నూతన భవనంలో ఒక ల్యాబ్ ను ఏర్పాటు చేశారన్నారు. పరిశ్రమలు ఎలాంటి వ్యర్ధాలు విడుదల చేస్తున్నాయని ఎప్పటికప్పుడు గమనించి చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఎక్కడా కాలుష్యం లేకుండా కాలుష్య నియంత్రణ మండలి అనేక చర్యలు చేపట్టిందన్నారు. ప్రమాదాలు లేకుండా రెడ్, ఆరెంజ్ కేటగిరీ పరిశ్రమలు పని చేస్తున్నాయన్నారు.
నియమాలు అధిగమిస్తే వెంటనే చర్యలు చేపడుతున్నామని చెప్పారు. ఆక్వా రంగం ద్వారా జరిగే కాలుష్యాన్ని కూడా నివారించే చర్యలు చేపట్టామన్నారు. తిరుమలలో పూర్తి స్థాయిలో ప్లాస్టిక్ ను నియంత్రించామని వెల్లడించారు. ఎప్పటికప్పుడు ప్రజల భద్రత దృష్ట్యా పని చేస్తున్న కాలుష్య నియంత్రణ మండలి సిబ్బందికి అభినందనలు తెలిపారు. అధికారులు కోరినట్టుగా తిరుపతిలో జోనల్ కార్యాలయం ఏర్పాటు చేస్తామని మంత్రి పెద్దిరెడ్డి హామీ ఇచ్చారు.
అలాగే కర్రల వివాదంపై మంత్రి పెద్దిరెడ్డి స్పందించారు. తనకు కర్రల వివాదం గురించి తెలియదని, అసలు వినలేదని అన్నారు. చిన్నారి లక్షితను చిరుతపులి చంపడం బాధకరమైన విషయమని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో బాలుడ్ని చిరుత దాడి చేస్తే కాపాడుకున్నామని గుర్తు చేశారు. రెండు చిరుతపులిలను బంధించి జూ లోనే ఉంచుతున్నామన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. కంచె వేయడమా లేదా శాశ్వతంగా సెక్యూరిటీ ఉంచాలా అనే దానిపై ఆలోచన చేస్తున్నామన్నారు. అటవీ శాఖలో సిబ్బంది కొరత లేదన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.