తెలుగుదేశం పార్టీ ముఖ్య నేత నారా లోకేష్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు ఆంధ్ర ప్రదేశ్ మంత్రి అంబటి రాంబాబు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లోకేష్ తన స్థాయికి మించి మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తూ పైశాచికాచినందం పొందుతున్నాడని దుయ్యబట్టారు. నా గురించి విమర్శలు చేసే స్థాయి లోకేష్ కు లేదన్నారు మంత్రి అంబటి. లోకేష్ రాజకీయ బఫూన్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
బీసీ సోదరులు అనమంటే బీసీ చౌదరిలు అంటున్నాడని.. వైశ్యులను వైశాలి అంటున్నాడని ఎద్దేవా చేశారు. లోకేష్ దిగజారుడు విమర్శలు చేస్తున్నాడని తీవ్రంగా మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. నేను పండుగ సమయంలో డాన్స్ చేశా అయితే ఇప్పుడు ఏంటి? నేను మాట్లాడటం మొదలు పెడితే మీరంతా ఏడుస్తారు అంటూ ధ్వజమెత్తారు.
సత్తెనపల్లిలో యువగళం పాదయాత్ర అట్టర్ ప్లాప్ అయిందని వ్యాఖ్యానించారు. వలంటీర్ గంగమ్మ అనే మహిళ దగ్గర డబ్బులు తీసుకున్నాని తప్పడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. నా కుటుంబ సభ్యులు రాజకీయాల్లో లేరు.. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ ను లోకేష్ చదువుతున్నాడంటూ ఫైర్ అయ్యారు మంత్రి అంబటి.
సీఎం జగన్ కాలి గోటికి కూడా కన్నా లక్ష్మీ నారాయణ సరిపోడంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీడీపీలో కన్నా ఎంతో కాలం ఉండడంటూ సెటైర్లు వేశారు. లోకేష్ ముందు ఎమ్మెల్యేగా గెలిచి.. ఆ తర్వాత నా గురించి మాట్లాడాలంటూ మంత్రి అంబటి సూచించారు. పోలవరంపై చంద్రబాబు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడని ధ్వజమెత్తారు. మీరంతా కలిసి వచ్చినా జగన్ ను ఏమీ చేయలేరన్నారు. మీరందరూ ఎన్ని కుట్రలు చేసినా.. వచ్చే ఎన్నికల్లో సీఎం వైఎస్ జగన్ మళ్లీ అధికారంలోకి వస్తారని పేర్కొన్నారు మంత్రి అంబటి రాంబాబు.