Welfare Scheme Funds: ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో సంక్షేమ పథకాల లబ్ధిదారులకు ఇబ్బందులు ఎదురైన విషయం తెలిసిందే. ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో సంక్షేమ పథకాల నిధులు లబ్ధిదారుల ఖాతాలకు వేయలేని పరిస్థితి ఏపీ ప్రభుత్వానికి ఎదురైంది. ఇది వైసీపీ కి పెద్ద తలనొప్పిగా మారింది. పథకాల లబ్ధిదారుల ఓట్లపైనే నమ్మకం పెట్టుకున్న పార్టీకి సంక్షేమ పథకాలు నిలిపివేత పెద్ద ఇబ్బందిగా మారింది. ఎన్నికల కమిషన్ రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ, విద్యా దీవెన, మహిళకు ఆసరా, చేయూత, ఈబీసీ నేస్తం పథకాలకు గాను నిధులను పంపిణీ చేయకూడదని ఆదేశాలు ఇచ్చింది. దీంతో మొత్తం రూ.14,165 కోట్ల నిధులు లబ్ధిదారుల ఖాతాల్లోకి చేరకుండా ఆగిపోయాయి.
Also Read: వైసీపీకి బిగ్ షాక్.. సజ్జల భార్గవ్ పై కేసు నమోదు
Welfare Scheme Funds: అయితే, ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ చేసిన కోర్టు కీలక వెసులుబాటు ఇచ్చింది. ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వులను ఈనెల 10వ తేదీ వరకూ అంటే, ఈరోజు వరకూ నిలిపివేస్తున్నట్టు (అబయన్స్) చేసింది. మళ్ళీ 11 నుంచి 13వ తేదీ వరకూ ఎలాంటి సంక్షేమ పథకాల నిధులను పంపిణీ చేయడం లేదా ట్రాన్స్ ఫర్ చేయడం చేయకూడదని కోర్టు ఆదేశించింది. దీంతో ఈరోజు నిధుల బదిలీకి ప్రభుత్వానికి అవకాశం దొరికింది. దీంతో మొత్తం రూ.14,165 కోట్ల నిధులు లబ్ధిదారుల ఖాతాల్లోకి వేయడానికి ప్రభుతం సిద్ధం అయింది. ఈరోజు మొత్తం నిధులు లబ్ధిదారుల ఖాతాలకు చేరుతాయని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు.
షరతులు వర్తిస్తాయి..
Welfare Scheme Funds: ప్రభుత్వ నిధులు లబ్ధిదారుల ఖాతాల్లో వేయడానికి అనుమతి దొరికినా.. కొన్ని కీలక షరతులను కోర్టు పెట్టింది. ఈ నిధుల పంపిణీకి సంబంధించి ఎటువంటి ప్రచారమూ నిర్వహించరాదని చెప్పింది కోర్టు. అంటే, పత్రికలూ, ఇంటర్నెట్, టీవీ రేడియో ఇలా ఎటువంటి మాధ్యమాల్లోనూ దీని గురించి ప్రచారం చేయకూడదు. అలాగే నిధులు పంపిణీ చేస్తున్నామంటూ సంబరాలు చేయడం కానీ, ఆర్భాటంగా ప్రకటనలు ఇవ్వడం కానీ చేయకూడదని కూడా కోర్టు ఆదేశించింది. అలాగే రాజకీయ నాయకులు ఈ పంపిణీ వ్యవహారంలో వేలు పెట్టకూడదని కూడా కోర్టు స్పష్టం చేసింది. ఈ వ్యవహారంలో ఎన్నికల సంఘం ఇచ్చిన ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ప్రభుత్వం ఎక్కడా తప్పి ప్రవర్తించ కూడదన్న కోర్టు.. దీనికి సంబంధించిన పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఎన్నికల సంఘాన్ని, ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్ గురువారం రాత్రి 10.20 గంటల సమయంలో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.