APPSC : ఏపీలో గ్రూప్-1 పరీక్ష రద్దు విషయంలో ఏపీపీఎస్సీకి(APPSC) హైకోర్టు(High Court) లో ఊరట లభించింది. పరీక్షను రద్దు చేస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ లో ఏపీపీఎస్సీ సవాల్ చేసింది. దీనిపై విచారణ నిర్వహించిన డివిజన్ బెంచ్ గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై తాత్కాలిక స్టే విధించింది. విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకూ ప్రస్తుతం ఉద్యోగాల్లో ఉన్న వారు కొనసాగుతారని స్పష్టం చేసింది. ఏపీపీఎస్సీ 2018లో నిర్వహించిన గ్రూప్-1 మెయిన్స్ పరీక్షను రద్దు చేస్తూ ఇటీవల సింగిల్ జడ్జి తీర్పునిచ్చారు.
ఇది కూడా చదవండి: Volunteers Suspended: కడపలో 11 మంది వాలంటీర్లు సస్పెండ్
దీంతో ఆ నోటిఫికేషన్ ద్వారా ఎంపికైన వారంతా ఉద్యోగాలు కోల్పోవాలసిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఏపీపీఎస్సీ డివిజన్ బెంచ్ లో అప్పీలుకు వెళ్లింది. ఈ పటిషన్ పై ఈ రోజు విచారణ నిర్వహించిన హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది. విచారణను వారం పాటు వాయిదా వేసింది.
అసలేమైందంటే?
2018 గ్రూప్-1 నోటిఫికేషన్(2018 Group-1 Notification) కు సంబంధించి జవాబు పత్రాలను మాన్యువల్ (చేతితో దిద్దడం), డిజిటల్ విధానంలో రెండుసార్లు మూల్యాంకనం చేశారని.. మొదటిసారి దిద్దిన ఫలితాలను దాచి పెట్టి.. రెండోసారి దిద్దించి నచ్చిన వారిని ఎంపిక చేసుకొని ఏపీపీఎస్సీ ఫలితాలు(APPSC Results) ప్రకటించిందని కొందరు అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. వారు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం మార్చి 13న సంచలన తీర్పు ఇచ్చింది. ఆ పరీక్షను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. మరో 6 నెలల్లో మెయిన్ ను మళ్లీ నిర్వహించాలని ఆదేశించింది.
అయితే.. ఆ సమయంలోనే ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఉద్యోగాలు సాధించి విధులు నిర్వర్తిస్తున్న వారు ఎవరూ ఆందోళన చెందవద్దని ప్రభుత్వం కోరింది. ఈ తీర్పుపై అప్పీలుకు వెళ్తామని ప్రకటించింది. ప్రభుత్వ ప్రకటన మేరకు ఏపీపీఎస్సీ డివిజన్ బెంచ్ కు అప్పీలుకు వెళ్లింది. ఈ మేరకు ఈ రోజు విచారణ జరిగింది.