School Holidays : ఆంధ్రప్రదేశ్ లో వాయుగుండం ప్రభావం అధికంగా ఉండడంతో విశాఖ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. అల్లూరి జిల్లా, అనకాపల్లి, విశాఖ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమవగా జలాశయాలన్నినిండుకుండలా మారాయి. ఏజెన్సీలో వాగులు పొంగి పొర్లుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.
ప్రజలు అత్యవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని అప్రమత్తంగా ఉండాలని, వాగులు దాటే ప్రయత్నం చేయోద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు విశాఖలో కుండపోత వర్షానికి గవర కంచరపాలెం, ఆనందపురం ప్రాంతాల్లో ప్రహరీ గోడలు కూలిపోవడం వల్ల కొన్ని వాహనాలు తీవ్రంగా ధ్వంసం అయ్యాయి. మరోవైపు బంగాళాఖాతంలో వాయుగుండం కారణంగా ఏపీ, తెలంగాణలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
ఈ నేపథ్యంలో.. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాతో పాటు.. వర్షాల ప్రభావం ఎక్కువగా ఉన్న శ్రీకాకుళం, విజయనగరం, ఉభయ గోదావరి జిల్లాలు, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్ జిల్లాలతో పాటు బాపట్ల జిల్లాలోని కొన్ని మండలాల్లో ఈ రోజు కూడా పాఠశాలలకు సెలవు ప్రకటించారు.