రెండు తెలుగు రాష్ట్రాల్లో కండ్ల కలకల వ్యాధి ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది. రోజు రోజుకూ ఈ కేసుల సంఖ్య పెరుగుతూండటంతో.. కంటి ఆస్పత్రుల వద్ద రోగులు క్యూ కట్టారు. ముఖ్యంగా పాఠశాలల్లో ఈ కండ్లకల ఈ వ్యాధి మరింత విజృంభిస్తోంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. కండ్ల కలకపై పిల్లలకు అవగాహన లేకపోవడం వల్లనే ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుందని పేర్కొంది.
స్కూళ్లల్లో ఒకరికి కండ్ల కలక వస్తే.. మిగిలిన విద్యార్థులకు వచ్చే ప్రమాదం ఉందని చెప్తోంది ప్రభుత్వం. ఈ వ్యాధిపై పిల్లలలో అవగాహన పెంచేవిధంగా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని జగన్ సర్కార్ సూచించింది. కండ్లకలక లక్షణాలు ఎలా ఉంటాయి? రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వస్తే ఏం చేయాలి? అనే దానిపై ప్రజలకు ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ అవగాహన కలిగేలా ప్రజలకు పలు హెచ్చరికలు జారీ చేసింది.
కళ్లు నొప్పిగా ఉండటం, దురద రావడం, వాపు రావడం, కళ్లు ఎర్రగా మారి నీరు రావడం, నిద్ర లేచిన తర్వాత కళ్లు అతుక్కుపోవడం లాంటివి ఏర్పడితే కండ్ల కలక సోకినట్లే. ఈ లక్షణాలు ఉంటే వెంటనే జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. లేకపోతే కళ్ల నుంచి చీము వచ్చే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. కండ్ల కలక బారిన పడ్డ వాళ్లు తరుచుగా చేతులను శుభ్రం చేసుకోవాలని, కళ్లద్దాలు పెట్టుకోవడం, ఇతరులకు సాధ్యమైనంతగా దూరంగా ఉండాలని హెచ్చరించారు.
ఈ కండ్ల కలకపై సొంత వైద్యం చేసుకోకూడదని సూచించింది. కళ్లు విపరీతంగా నొప్పి వస్తే ఖచ్చితంగా ఆస్పత్రిలో చూపించుకోవాలని వెల్లడించారు. ఇతరులకు కరచాలనం ఇవ్వడం కూడా కరెక్ట్ కాదని పేర్కొన్నారు. కండ్ల కలక ఉన్న వారు వాడిన టవల్స్, కర్చీఫ్, దుప్పట్లు ఇతరులకు ఇవ్వకూడదని సూచించింది. కండ్ల కలక వచ్చిన పిల్లలను స్కూల్ కి పంపించ వద్దని ఆంధ్ర ప్రదేశ్ సర్కార్ సూచించింది.