AP Floods: ఒక పక్క వర్షాలు.. మరో పక్క వరదలు.. పై నుంచి కురుస్తున్న వాన నీళ్లు.. కింద నిలబడనీయకుండా చేస్తున్న వరద నీరు.. ప్రజల్ని అతలాకుతలం చేసేస్తున్నాయి. ఇల్లూ వాకిలీ నీటిలో మునిగిపోయి.. బతుకు జీవుడా అంటూ సురక్షిత ప్రాంతానికి చేరుకున్న వారికీ గుక్కెడు నీరు కూడా దొరకని పరిస్థితి. రోడ్డుపై ప్రయాణిస్తూ.. భారీ వర్షంలో చిక్కుకుని పక్కాగా ఆగిన వారి వాహనాలను వరద లాక్కెళ్లిపోతే దిక్కుతోచక నడిరోడ్డుపై నిలబడిపోయిన బాధితుల ఆవేదన. ఈ వార్తలు వింటున్న వారినీ.. చూస్తున్న వారినీ కలచివేస్తున్నాయి.
ఇంతటి విపత్కర పరిస్థితిలో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. వారి కష్టాలను క్యాష్ చేసుకోవడానికి కేటుగాళ్లు రెడీ అయిపోయారు. పడవల్లో సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి వేలాది రూపాయలు గుంజుతున్న వార్తలు వస్తున్నాయి. మరో పక్క వరద నీటిలో కొట్టుకుపోయిన వాహనాలను బయటకు తీసేందుకు భారీగా డబ్బు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎన్టీఆర్ జిల్లా నందిగామ, ఐతవరం వద్ద వరద ప్రాంతంలో పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంది. ఇక్కడ పదుల సంఖ్యలో టూ వీలర్స్ వరద బురదలో కూరుకుపోయాయి. అంతే సంఖ్యలో కార్లు కూడా బురదలో ఇరుక్కుపోయాయి.
AP Floods: ఇలా చిక్కుకుపోయిన వాహనాలను వెలికి తీయడానికి ప్రయివేటు వ్యక్తులను ఆశ్రయించాల్సిన పరిస్థితి. ఇదే అవకాశంగా ఒక్కో కారుకు బయటకు తీయడానికి 15 వేల రూపాయాల వరకూ వసూలు చేస్తున్నారు. తప్పనిసరి పరిస్థితిలో కార్లను వారడిగినంత డబ్బూ ఇచ్చి బయటకు తీసుకువస్తున్నారు యజమానులు.
టోల్ గేట్ నిర్వాహకుల నిర్వాకం..
AP Floods: కీసర టోల్ గేట్ వద్ద వాహనదారుల ఫాస్టాగ్ పిండి మరీ పైసలు వసూలు చేస్తున్న టోల్ గేట్ నిర్వాహకులు అక్కడి దగ్గరలోనే వరదకు గుంటగా మారిపోయిన రోడ్డును పట్టించుకోవడం లేదు. రోడ్డు కొట్టుకుపోయినా.. టోల్ కట్టాల్సిందే అంటూ వాహనదారుల తోలు వలిచేస్తున్నారు. జాతీయ రహదారి నుంచి రెండువందల మీటర్ల దూరం వరకూ పలు వాహనాలు కొట్టుకుపోయాయి. వాటిని బయటకు తీసుకురావడానికి టోల్ గేట్ సిబ్బంది ఏమాత్రం ప్రజలకు సహాయపడడం లేదు. మరోవైపు కొట్టుకుపోయిన తమ వాహనాల్లో డబ్బు, బంగారం, ఇతర విలువైన వస్తువులు దొంగల పాలయ్యాయని యజమానులు వాపోతున్నారు. వరదలో చిక్కుకున్న వాహనాలకు రక్షణ లేకుండా పోయింది. పైపెచ్చు వాటిని బయటకు తీయడానికి కూడా ఏమాత్రం సహాయపడకుండా.. దోపిడీకి ఊతమిస్తున్నారంటూ టోల్ గేట్ నిర్వాహకులపై బాధితులు మండిపడుతున్నారు. అధికారులు ఇప్పటికైనా గమనించి తమకు సహాయపడాలని వారంతా కోరుతున్నారు.