CM Jagan: ఏపీలో మరికొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే శ్రీనివాసులును పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈరోజు ఉదయం పవన్ కళ్యాణ్‌ను కలవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. అయితే ఎన్నికల్లో మరోసారి విజయం సాధించాలని వ్యూహాలు రచిస్తున్న సీఎం జగన్.. సర్వేల ఆధారంగా గెలిచే అభ్యర్థులకే టికెట్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ కట్ చేశారు. సీఎం జగన్ తీసుకున్న ఈ నిర్ణయంతో కొందరు నేతలు ఇప్పటికే వైసీపీ కి రాజీనామా చేసి ఇతర పార్టీలలో చేరిన విషయం తెల్సిందే.
జనసేనలో చేరేందుకు..
జగన్ ను ఏపీలో గద్దె దించేందుకు వ్యూహాలు రచిస్తున్న టీడీపీ, జనసేన పార్టీలు వైసీపీలోని నాయకులను తమ పార్టీలోకి లాగేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. వైసీపీ నుంచి టికెట్ రాని నేతలను తమ పార్టీలో చేర్చుకుంటున్నాయి. అయితే.. ఇటివల వైసీపీ అధిష్టానం తిరుపతి అభ్యర్థిని మారుస్తూ నిర్ణయం తీసుకుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీనివాసులు కాకుండా తిరుపతి సెగ్మెంట్ కు ఆర్టీసీ వైస్ ఛైర్మన్ విజయానందరెడ్డి ని సీఎం జగన్ నియమించారు. తనకు టికెట్ రాలేదని అసంతృప్తిగా ఉన్న శ్రీనివాసులు వైసీపీకి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నారు. జనసేనలో చేరాలని భావించిన శ్రీనివాసులు ఈరోజు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు. త్వరలో జనసేనలో చేరేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సీఎం జగన్ వైసీపీ నుంచి ఆయన్ని సస్పెండ్ చేశారు.