AP EAPCET Postponed : ఏపీ లో ఈఏపీ సెట్(AP EAPCET) పరీక్ష వాయిదా పడింది. మే 13 నుంచి మొదలు కావాల్సి ఉన్న ఈ సెట్ పరీక్షలను అధికారులు ఎన్నికల నేపథ్యంలో వాయిదా వేశారు. మే 13న పోలింగ్ ఉన్న నేపథ్యంలో ఈఏపీసెట్ ను మే 16 న నిర్వహిస్తున్నట్లు అధికారులు వివరించారు. ఈ క్రమంలోనే మే 16, 17 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు నిర్వహిస్తామని అధికారులు వివరించారు.
మే 18 నుంచి మే 22 వరకు ఇంజినీరింగ్ పరీక్షలు(Engineering Exams) నిర్వహించనున్నారు. ఈ క్రమంలోనే జూన్ 3 న జరగాల్సిన ఏపీ పీజీ సెట్(AP PG CET) జూన్ 10 కి వాయిదా పడింది. ఏపీ పీజీసెట్ పరీక్షలు జూన్ 10 నుంచి 14 వరకు నిర్వహించనున్నారు. ఈఏపీ సెట్ నోటిఫికేషన్ గతేడాది కాకినాడ జేఎన్‌టీయూ(JNTU) విడుదల చేసింది.
ఈ నోటిఫికేషన్ పరీక్ష ద్వారా ఇంజినీరింగ్, బయోటెక్నాలజీ, బీటెక్ , బీఎస్సీ అగ్రికల్చర్/హార్టీకల్చర్, బీవీఎస్సీ అండ్ ఏహెచ్, బీ ఫార్మసీ, బీఎఫ్‌ఎస్సీ, ఫార్మా డీ, బీఎస్సీ నర్సింగ్, బీఎస్సీ/సీఏ అండ్ బీఎం లాంటి విభాగాల్లో అడ్మిషన్లు ఇవ్వనున్నారు. ఈ పరీక్షల్లో విద్యార్థులు సాధించే ర్యాంకుల ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ,ప్రైవేట్ కాలేజీల్లో అడ్మిషన్లను పూర్తి చేయనున్నారు.
ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ -1 ప్రిలిమ్స్(APPSC Group-1 Prelims) పరీక్షకు సంబంధించిన ఆన్సర్ కీ ని బుధవారం విడుదల చేశారు. ఏపీపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ ఈ కీ ని అందుబాటులో ఉంచినట్లు అధికారులు వివరించారు. ఈ కీ పై ఏమైనా అభ్యంతరాలు ఉంటే వాటిని కమిషన్ దృష్టికి తీసుకుని వచ్చేందుకు అవకాశం ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఏపీపీ ఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష ఆన్సర్ కీ ని psc.ap.gov.in లో అందుబాటులో ఉంచారు.
ఈ కీ పై అభ్యంతరాలను గురువారం వరకు స్వీకరిస్తామని అధికారులు వివరించారు. వచ్చే అభ్యంతరాలను పరిశీలించి మార్కుల పై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అభ్యంతరాలను అన్ని ప్రకటించిన తరువాత మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తామని అధికారులు వివరించారు.
Also Read : మార్చి 31న అన్ని బ్యాంకులు పని చేయాల్సిందే… ఆర్బీఐ ఆదేశాలు!