ఏపీ సీఎం జగన్ (AP CM jagan) రేపు తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ను (KCR) పరామర్శించనున్నారు. ఇటీవల కేసీఆర్ ఎడమతుంటికి ఆపరేషన్ జరిగిన విషయం తెలిసిందే. అనంతరం ఆయన హైదరాబాద్ నందినగర్ లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ రేపు ఆయనను పరామర్శించనున్నారు. 2019 ఎన్నికల్లో ఏపీలో వైసీపీ విజయం తర్వాత జగన్ నాటి తెలంగాణ సీఎం కేసీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఇది కూడా చదవండి: AP Politics: షర్మిలతో పాటు జగన్ ఇంటికి వెళ్తున్నా.. కాంగ్రెస్ లో కూడా చేరుతున్నా: ఎమ్మెల్యే ఆర్కే
అనంతరం కేసీఆర్ జగన్ ప్రమాణస్వీకారానికి కూడా హాజరయ్యారు. అయితే.. ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోయింది. బీఆర్ఎస్ ఓటమి తర్వాత కేసీఆర్ ను తొలిసారి కలవనున్నారు జగన్. తెలంగాణలో పార్టీ పెట్టిన జగన్ సోదరి షర్మిల రేపు ఆ పార్టీని కాంగ్రెస్ ను విలీనం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం, తెలంగాణ మాజీ సీఎం భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే.. ఇది కేవలం మర్యాదపూర్వక భేటీ మాత్రమేనని బీఆర్ఎస్, వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.
ఇదిలా ఉంటే.. ఈ రోజు కాకినాడలో జరిగిన పెన్షన్ల పెంపు కార్యక్రమంలో పాల్గొన్న జగన్ రానున్న రోజుల్లో కుటుంబాలను చీలుస్తారని.. కుట్రలు చేస్తారని ప్రతిపక్షాలపై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. షర్మిల కాంగ్రెస్ చేరిక నేపథ్యంలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో సాగుతోంది.