AP CM Jagan London Tour: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఎంపీ విజయసాయి రెడ్డి విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు పర్మిషన్ ఇచ్చింది. అక్రమాస్తుల కేసులో వీరిద్దరూ ఏ1, ఏ2 నిందితులుగా ఉన్నారు. గతంలో సీబీఐ అరెస్ట్ చేయడంతో బెయిల్ పై బయటకు వచ్చారు. ఈ క్రమంలో కోర్టు అనుమతితోనే విదేశాలకు వెళ్లాలన్న నిబంధన ఉంది. ఈ కారణంగా వీరిద్దరి పాస్ పోర్టులు కోర్టు ఆధీనంలో ఉంటాయి. విదేశీ పర్యటనకు వెళ్లాల్సినప్పుడల్లా కోర్టు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.
కోర్టు అనుమతితో ఖరారైన సీఎం జగన్ విదేశీ పర్యటన:
ఈ క్రమంలో సీఎం జగన్, ఎంపీ విజయసాయి కోర్టు అనుమతి తీసుకున్నారు. సీఎం జగన్ యూకేకు వ్యక్తిగత పర్యటనకు వెళ్లనున్నారు. సెప్టెంబర్ 2వ తేదీ నుంచి 12వ తేదీ వరకు యూకేలో పర్యటించనున్నారు. యూకేలో సీఎం కుమార్తెలు చదువుకుంటున్నారు. వారిని కలిసేందుకు సీఎం జగన్.. కోర్టుకు దరఖాస్తు చేసుకుని అనుమతి కోరారు. అలాగే ఎంపీ విజయసాయి రెడ్డి వచ్చే రు నెలల కాలంలో నెల రోజుల పాటు విదేశీ యూనివర్సిటీలతో ప్రభుత్వ ఒప్పందాల కోసం యూకే, యూఎస్, జర్మనీ, దుబాయ్, సింగపూర్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ సీబీఐ కోర్టులో ఎంపీ విజయసాయిరెడ్డి సైతం పిటిషన్ దాఖలు చేశారు. విజయసాయి కి కూడా కోర్టు అనుమతి ఇచ్చింది.
సాక్షులను ప్రభావితం చేసే ఛాన్స్ ఉంది:
అయితే వీరిద్దరి విదేశీ పర్యటనలకు అనుమతి ఇవ్వొద్దని సీబీఐ కోర్టులో వాదించింది. జగన్, విజయ సాయి దాఖలు చేసిన అభ్యర్థనలను తిరస్కరించాలని సీబీఐ విజ్ఞప్తి చేసింది. విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దని, సాక్షులను వీరు ప్రభావితం చేసే అవకాశం ఉందని పీపీ కోర్టు వివరించారు. అయతే వీరి వాదనను తోసి పుచ్చిన కోర్టు.. జగన్, విజయసాయి రెడ్డిలకు అనుకూలమైన తీర్పును ఇచ్చింది.
గతంలో కూడా కోర్టు అనుమతితో విదేశాలకు:
గతంలో అక్రమాస్తుల కేసులో వైఎస్ జగన్ తో పాటు విజయసాయిరెడ్డికీ రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసే సందర్భంలో సీబీఐ కోర్టు పలు షరతులు విధించింది. ఇందులో ముందస్తు అనుమతితోనే విదేశీ పర్యటనలు చేయాలనే షరతు కూడా ఒకటి. దీంతో గతంలో ఓసారి విజయసాయి రెడ్డి కోర్టు అనుమతి తీసుకుని విదేశీ టూర్ కు వెళ్లారు. ఇప్పుడు మరోసారి సాయిరెడ్డితో పాటు జగన్ కూడా విదేశీ టూర్లకు అనుమతి కోరారు. ఈసారి సారి కూడా సీబీఐ కోర్టు పర్మిషన్ తో విదేశాలకు వెళ్తున్నారు సీఎం జగన్, ఎంపీ విజయసాయి రెడ్డి.
ముఖ్యమంత్రి జగన్ కు రాఖీలు కట్టిన హౌస్ కీపింగ్ మహిళలు:
రాఖీ పండుగను పురస్కరించుకుని సీఎం వైఎస్ జగన్ ను కలిసి సీఎం క్యాంప్ ఆఫీస్ హౌస్ కీపింగ్ మహిళలు రాఖీలు కట్టారు. వారిని ముఖ్యమంత్రి జగన్ ఆప్యాయంగా పలకరించారు. ముఖ్యమంత్రి చేతికి రాఖీలు కట్టి మహిళా సిబ్బంది అభిమానాన్ని చాటుకున్నారు. ఇదిలా ఉండగా బుధవారం నాడే మహిళా మంత్రులు తానేటి వనిత, విడదల రజని, పలువురు మహిళా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాఖీలు కట్టి అభినందనలు తెలిపారు.
ఇక రాఖీ పౌర్ణమి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి మహిళా లోకానికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అంటూ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. వారు చూపుతున్న ప్రేమాభిమానాలకు సదా కృతజ్ఞతుడినని అన్నారు. మహిళల సంక్షేమమే లక్ష్యంగా.. వారి రక్షణే ధ్యేయంగా పాలన సాగిస్తున్నందుకు సంతోషిస్తున్నానని తెలిపారు సీఎం జగన్. ఒక అన్నగా, ఒక తమ్ముడిగా ఎప్పుడూ అండగా ఉంటానని మాట ఇస్తున్నట్లు పేర్కొన్నారు ఏపీ సీఎం జగన్.
ఇవి కూడా చదవండి:
మద్యం తాగిన తర్వాత ఈ ఆహార పదార్థాలను తింటున్నారా.. అయితే జాగ్రత్త!!
Srisailam: శ్రీశైలంలో భారీ అగ్ని ప్రమాదం.. కోట్ల రూపాయల్లో నష్టం
Good News for Tenant Farmers: కౌలు రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం
Andhra Pradesh Rain Forecast: ఆంధ్రప్రదేశ్ కు వర్ష సూచన.. సెప్టెంబర్ లో భారీ వర్షాలు!!