Election Commission: కేంద్ర ఎన్నికల కమిషన్ టీం (Central Election Commission) మూడు రోజుల పాటు ఏపీ(AP)లో పర్యటించనున్నారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు అనూప్ చంద్ర పాండే, అరుణ్ గోయల్ విజయవాడ కు వస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీకి ఏపీ సీఈఓ ఎంకే మీనా (MK Meena) లేఖ రాశారు. గత నెల 23 న టీడీపీ ఇచ్చిన రిప్రజెంటేషన్ పై తీసుకున్న చర్యల గురించి వివరిస్తూ సీఈఓ టీడీపీకి ప్రత్యుత్తరం రాశారు.
చంద్రబాబు-పవన్ భేటీ..
ఈ క్రమంలోనే ఏపీకి వస్తున్న కేంద్ర ఎన్నికల సంఘాన్ని మంగళవారం నాడు చంద్రబాబు (Chandrababu), పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ప్రత్యేకంగా కలవనున్నారు. 2024 ఓటర్ల తుది జాబితా తయారీలో భాగంగా 2023 డిసెంబర్ 9 వరకూ వచ్చిన వేర్వేరు దరఖాస్తులను పరిష్కరించామని మీనా వివరించారు. డిసెంబర్ 9 వ తేదీ తరువాత వచ్చిన 17,976 దరఖాస్తులను కూడా 2024 జనవరి 12 వ తేదీలోగా పరిష్కారిస్తామని ఆయన చెప్పారు.
5 లక్షల 64 వేల 819 పేర్లను అనర్హులు...
రాష్ట్రంలో మృతి చెందిన ఓటర్లు, డూప్లికేట్ కేసులు, ఓటు బదిలీ దరఖాస్తులను ఇంటింటి సర్వే నిర్వహించి పరిష్కరించామని వివరించారు. అన్ని రాజకీయ పార్టీల నుంచి వచ్చిన ఫిర్యాదుల్లో 14.48 లక్షల ఓటర్ల పేర్లను గుర్తించాం. ఇందులో సుమారు 5 లక్షల 64 వేల 819 పేర్లను అనర్హులుగా గుర్తించినట్లు మీనా లేఖలో వివరించారు.
అన్ని జిల్లాల కలెక్టర్లూ ఆయా అనర్హులను ఓటర్ల జాబితా నుంచి తొలగించినట్లు పేర్కొన్నారు. కొన్ని నియోజకవర్గాల్లో భారీ సంఖ్యలో ఓటర్లుగా ఆన్‌లైన్ దరఖాస్తులు చేస్తున్నారన్న ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. కాకినాడ లో ఫాం 7 ద్వారా ఓటర్లను అధిక సంఖ్యలో చేరుస్తున్న 13 మంది పై ఎఫ్‌ఐఆర్ ను నమోదు చేసినట్లు తెలిపారు.
ఈ వ్యవహారం గురించి పోలీసు స్టేషన్లలో అభియోగపత్రాలు కూడా దాఖలు అయ్యాయని వివరించారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఫాం 7 లను కావాలని దాఖలు చేసిన 6 గురు వ్యక్తుల పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపారు. అటు చంద్రగిరి నియోజకవర్గంలో ఐపీసీ, ఐటీ చట్టాల కింద కేసులు నమోదు చేశామని లేఖలో సీఈవో వివరించారు. పర్చూరులో 10 ఎఫ్‌ఐఆర్ లు నమోదు చేసినట్లు వివరించారు.
చంద్రగిరి నియోజకవర్గంలో ఉల్లంఘనలకు పాల్పడిన 24 మంది బీఎల్ ఓ లపై చర్యలు కూడా తీసుకున్నట్లు వివరించారు. ఇప్పటికే కావలి, గురజాల, బనగానపల్లె, పిఠాపురం తదితర నియోజకవర్గాల్లో ఫాం7 దరఖాస్తులో వచ్చిన అభ్యంతరాలను తనిఖీ చేయించినట్లు వివరించారు.
ఒకే ఇంటిలో 10 మంది కంటే ఎక్కువ ఓటర్లు ఉన్న కేసుల్లో 97 శాతం మేర తనిఖీలు పూర్తి చేసి ఓటర్ల జాబితా సవరించినట్లు తెలిపారు. ఒకే కుటుంబంలోని ఓటర్లు వేర్వేరు పోలీంగ్ కేంద్రాలకు మారిపోయిన ఘటనలూ ఎన్టీఆర్ , విశాఖ జిల్లాల్లో నమోదు అయినట్లు వివరించారు. విశాఖలో 26 వేల మంది ఓటర్లు, ఎన్టీఆర్ జిల్లాలో 2,27,906 ఓటర్లకు సంబంధించి ఓటర్లు ఇతర పోలింగ్ కేంద్రాలకు మారింది.
గందరగోళం లేకుండా ఈ జాబితాలను సవరించేందుకు కార్యాచరణ చేపట్టాం.ఓకే చోట 3 ఏళ్లు సర్వీసు పూర్తైన ప్రభుత్వ ఉద్యోగులు, క్రిమినల్ కేసులు నమోదైన వారు, ఈసీ క్రమశిక్షణా చర్యలకు ఆదేశించిన అధికారుల ఎన్నికల విధుల్లో ఉండరు. ఓటర్ల జాబితా రూపకల్పనలో తప్పిదాలకు సంబంధించి ఇప్పటికే చర్యలు తీసుకున్నాంమని తెలిపారు.
ఉరవకొండ, ప్రొద్దుటూరు నియోజకవర్గాల ఈఆర్వోలు, పర్చూరు ఏఈఆర్వో, 1 సీఐ, 3 ఎస్ఐలు సస్పెండ్ అయ్యారు50 మంది వరకూ బీఎల్వోలపై క్రమశిక్షణా చర్యలకు ఆదేశాలిచ్చామని టీడీపీకి రాసిన లేఖలో వివరణ ఇచ్చారు.
Also Read: విజయ్ దేవరకొండ, రష్మిక నిశ్చితార్థం..ఫిబ్రవరిలో..?