చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం అంగళ్లులో జరిగిన ఘర్షణల కేసులో తెలుగు దేశం పార్టీ నేతలు దేవినేని ఉమామహేశ్వర్ రావు, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డిలకు ఆంధ్ర ప్రదేశ్ కోర్టులో ఊరట లభించింది. సోమవారం వరకు వారిద్దరినీ అరెస్టు చేయబోమని హైకోర్టుకు అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) తెలిపారు. అంగళ్లు ఘటనకు సంబంధించి దేవినేని ఉమ, నల్లారి కిషోర్‌కుమార్ రెడ్డిలపై కేసులు నమోదైన విషయం తెలిసిందే. దీంతో వీరిరువురి ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ వేయగా శుక్రవారం విచారణ జరిగింది. వీరి తరపున సీనియర్ న్యాయవాదులు పోసాని వెంకటేశ్వర్లు, ఎన్వీ సుమంత్ వాదనలు వినిపించారు.
అయితే తమకు వివరాలు అందించేందుకు సోమవారం వరకు సమయం కావాలని ప్రభుత్వ న్యాయవాది కోరారు. సోమవారం వరకు అరెస్ట్ చేయబోమని అడిషనల్ అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. దీంతో కేసు తదుపరి విచారణను హైకోర్టు ఈనెల 14వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది. దీంతో దేవినేని ఉమ, నల్లరి కిషోర్ లకు సోమవారం వరకు ఊరట లభించింది.
కాగా పుంగనూరు, అంగళ్లు ఘటనల్లో తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో సహా వందల మంది టీడీపీ నేతలు, కార్యకర్తలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇప్పటి వరకు 12 ఎఫ్ఐఆర్ లు, 317 మందిపై హత్యాయత్నం సహా పలు సెక్షన్ లతో కేసులు బుక్ చేశారు. ఇప్పటికే 81 మందిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. దీంతో పెద్ద ఎత్తున అరెస్టులతో బాధితుల కుటుంబ సభ్యుల ఆవేదన, ఆందోళన నెలకొంది. ఈ క్రమంలోనే టీడీపీ నేతలు దేవినేని ఉమ, నల్లారి కిషోర్ లు అరెస్ట్ కావాల్సి ఉండగా.. హైకోర్టు తీర్పుతో కాస్త ఊరట లభించింది.