మెగా డిఎస్సీ కి పారదర్శకంగా, కట్టుదిట్టమైన ఏర్పాట్లు..లోకేశ్ ఆదేశాలు

పారదర్శకంగా, పకడ్బందీగా మెగా డీఎస్సీకి ఏర్పాట్లు చేయాలని ఏపీ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. ఈనెల 11న ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డుల ప్రదానం చేయనున్నారు. పాఠశాల, ఇంటర్మీడియట్ విద్యాధికారులతో మంత్రి లోకేష్ సమీక్ష నిర్వహించారు.  

author-image
By Manogna alamuru
New Update
ap

Minister Nara Lokesh: 

ఆంధ్రాలో  టెట్ -2024 విజయవంతంగా పూర్తయిన నేపథ్యంలో మెగా డిఎస్సీని పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. స్కూల్ ఎడ్యుకేషన్, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ పై మంత్రి లోకేష్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ... మెగా డిఎస్సీ నిర్వహణ విధివిధానాలపై సమావేశంలో చర్చించారు. సాధ్యమైనంత ఎక్కువమంది అభ్యర్థులకు అవకాశం కల్పించాలన్నదే తమ లక్ష్యమని తెలిపారు. రాష్ట్రంలోని ఉత్తమ ఉపాధ్యాయులకు ఈనెల 11వతేదీన నిర్వహించే కార్యక్రమంలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను ఇవ్వాలని నిర్ణయించారు. 

పాఠశాలల్లో విద్యాప్రమాణాల మెరుగుపర్చే చర్యల్లో భాగంగా తల్లిదండ్రులను భాగస్వాములను చేస్తూ డిసెంబర్ మొదటివారంలో మెగా పిటిఎం నిర్వహించాలని మంత్రి లోకేష్ సూచించారు.  వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందే ఉపాధ్యాయుల ప్రమోషన్లు, బదిలీలు పూర్తిచేయాలని అన్నారు. రాష్ట్రంలో పాఠశాల విద్యార్థులకు అపార్ ఐడి కార్యక్రమం ఇప్పటివరకు 57.48శాతం పూర్తయిందని అధికారులు తెలుపగా, సాధ్యమైనంత త్వరగా ఈ ప్రక్రియ పూర్తిచేయాలని చెప్పారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులందరికీ రిపోర్టు కార్డులు అందజేయాలని సమావేశంలో నిర్ణయించారు. ప్రభుత్వ పాఠశాలల్లో స్కూల్ ర్యాంకింగ్స్ పై దృష్టి సారించాలని అన్నారు. రాష్ట్రంలో ప్రైవేటు విద్యాసంస్థలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాలని, ఇందులో భాగంగా అటెండెన్స్ మెరుగుదలకు చర్య తీసుకోవాలని కోరారు. 

రాష్ట్రంలోని అన్ని స్కూళ్లలో కనీస మౌలిక సదుపాయాలైన టాయ్ లెట్స్, వాటర్, బెంచీలు, లీక్ ప్రూఫ్స్ భవనాలు, పెయింటింగ్స్ వంటివాటిపై దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. రాష్ట్రం మొత్తాన్ని నాలుగుజోన్లుగా విభజించి విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనంలో మెనూలో మార్పులు చేసే అంశాన్ని పరిశీలించాలని అన్నారు. వచ్చే ఏడాదికల్లా మండలానికో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రభుత్వ కళాశాలల్లో పాస్ పర్సంటేజి మెరుగుదలపై దృష్టి సారించాలని అన్నారు. ఇందుకోసం అవసరమైతే వెనుకబడిన విద్యార్థులకు బ్రిడ్జి కోర్సులు నిర్వహించాలని అన్నారు. ఇంటర్మీడియట్ విద్యార్థుల ప్రశ్నాపత్రాలను ఎఐ ద్వారా ఎవాల్యుయేషన్ చేసే అంశాన్ని పరిశీలించాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో రాష్ట్ర పాఠశాల విద్య కార్యదర్శి కోన శశిధర్, స్కూల్ ఎడ్యుకేషన్ డైరక్టర్ విజయరామరాజు, ఇంటర్మీడియట్ విద్య డైరక్టర్ కృతికా శుక్లా, సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్టు డైరక్టర్ బి.శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Also Read: BJP: ప్రియాంకా గాంధీ ఓ శూర్పణఖ.. సుబ్రమణ్య స్వామి వివాదాస్పద పోస్ట్!

 

 

 

 

Advertisment
Advertisment
తాజా కథనాలు