Andhra Pradesh :
వరద బాధితుడిపై చేయి చేసుకున్న వీఆర్వోపై ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. విజయవాడ నగరంలోని అజిత్ సింగ్ నగర్లో ఆహారం, నీరు అందించడం లేదని అడిగిన వరద బాధితుడిపై చేయి చేసుకున్న వీఆర్వో విజయలక్ష్మిని కలెక్టర్ సృజన సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు. వరదతో సర్వస్వం కోల్పోయిన బాధితులకు అన్ని రకాలుగా అండగా ఉండాలని.. వారు కోపంలోనో, అసహనంతోనో ఓ మాట అన్నప్పటికీ .. అధికారులు ఓపిక పట్టాలి అని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే.
అయినప్పటికీ సీఎం ఆదేశాలు బేఖాతరు చేస్తూ కొంతమంది అధికారులు వరద బాధితుల పట్ల బాధ్యతరహిత్యంగా ప్రవర్తిస్తున్నారు. వారితో కఠినంగా మాట్లాడుతున్నారు. అలాంటి అధికారులపై ఏపీ ప్రభుత్వం కొరడా ఝుళిపిస్తోంది. సోమవారం సింగ్ నగర్లో వరద బాధితులపై అకారణంగా చేయి చేసుకున్న వీఆర్వోను విధుల నుండి తొలగిస్తున్నట్టు కృష్ణా జిల్లా కలెక్టర్ సృజన ఉత్తర్వులు జారీ చేశారు. మరోసారి అధికారులు ఇలాంటి చర్యలకు పాల్పడితే ఊరుకునేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
విజయవాడ నగరంలోని అజిత్ సింగ్ నగర్లోని షాదీఖాన రోడ్డులో తమకు ఆహారం, నీళ్ళు ఇవ్వడం లేదంటూ బాధితులు ఒక్కసారిగా ఆందోళన చేపట్టారు. ఈ విషయం గురించి విచారించేందుకు వచ్చిన వీఆర్వో విజయలక్ష్మిని.. ఆహారం, నీళ్ళు ఎందుకు ఇవ్వడం లేదు.. అనేక ఇబ్బందులు పడుతున్నామని.. చిన్న పిల్లలు తీవ్ర అవస్థలు పడుతున్నారంటూ బాధితులు వీఆర్వోని అడ్డగించి నిలదీశారు. కొద్దిసేపు బాధితులకు, వీఆర్వోకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.
దీంతో సహనం కోల్పోయిన వీఆర్వో విజయలక్ష్మి ఓ బాధితుని చెంప పగలగొట్టింది. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో.. పోలీసులు వీఆర్వోను అక్కడి నుండి దూరంగా పంపించి వేశారు. వీఆర్వో పై తక్షణమే చర్యలు తీసుకోవాలని వరద బాధితులు ఆందోళనకు దిగారు.