TTD : తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వులు కలిశాయనే వార్తలతో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు టీటీడీ ఆగమ సలహా మండలి తిరుమలలో శాంతి హోమం నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా సోమవారం ఉదయం ఆరు గంటల నుంచి 10 గంటల వరకూ శాంతి హోమం నిర్వహించనున్నారు. శ్రీవారి ఆలయంలోని బంగారు బావి పక్కన ఉన్న యాగశాలలో శాంతి హోమం ఆలయ ప్రధాన అర్చకులు శాంతి హోమం నిర్వహిస్తారు.
శాంతి హోమంలో భాగంగా వాస్తు హోమం, పంచగవ్య ప్రోక్షణ, గో పాలు, పెరుగు, గో పంచకంతో ఆరాధన చేయనున్నారు. ఈ యాగంలో ఎనిమిది మంది అర్చకులు, ముగ్గురు ఆగమ సలహాదారులు పాల్గొంటారు. ఈ విషయాన్ని టీటీడీ ఈవో జె.శ్యామలరావు స్వయంగా తెలియజేశారు. తిరుపతి లడ్డూ అపవిత్రం విషయమై విలేకర్లతో మాట్లాడిన శ్యామలరావు.. పలు కీలక వివరాలు వెల్లడించారు. తిరుమలలో కల్తీ నెయ్యి విషయం భక్తులను ఆందోళన కలిగించిందని అన్నారు.
భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే ప్రస్తుతం ఆవు నెయ్యి తీసుకునే విధానంలో మార్పు తెచ్చామన్న టీటీడీ ఈవో.. నందిని, ఆల్ఫా సంస్థల నుంచి స్వచ్ఛమైన ఆవు నెయ్యిని కొనుగోలు చేస్తున్నామని వివరించారు. కేజీ నెయ్యి రూ.475 లకు కొంటున్నామని చెప్పారు. ప్రస్తుతం లడ్డూ తయారీకి సరఫరా అవుతున్న నెయ్యిని కూడా ఎన్‌డీబీబీకి పంపామన్న శ్యామలరావు.. దీనికి సంబంధించిన రిపోర్టులు సైతం స్వచ్ఛమైన నెయ్యిగా నిర్ధారించిందన్నారు.
ఎనేబియల్ ల్యాబ్స్‌కు నెయ్యిని ఎప్పటికప్పుడు టెస్టింగ్ కు పంపిస్తున్నామని వివరించారు. మరోవైపు తిరుమల లడ్డూ నాణ్యతకు సంబంధించి 18 మందితో సెన్సరీ ప్యానల్ ఏర్పాటు చేసినట్లు టీటీడీ ఈవో వివరించారు. సీఎఫ్‌టీఆర్‌ఐలో వీరంతా శిక్షణ తీసుకున్నారన్న ఈవో.. టీటీడీ ద్వారా కూడా మూడు నెలల పాటు శిక్షణ ఇచ్చామన్నారు.
Also Read : 15 రోజుల్లో 4500 ఫోన్ల ట్యాపింగ్!