PM Modi: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) లడ్డూ కల్తీ వివాదం కొనసాగుతున్న వేళ మరో ఆసక్తికర అంశం చర్చనీయాంశమైంది. జంతువుల కొవ్వుతో తయారు చేసినట్లు ఆరోపణలు వస్తుండగా ఈ లడ్డూలను ప్రధాని మోదీ, అయోధ్యకు బహుమతిగా ఇచ్చింది టీటీడీ. స్వయంగా మాజీ సీఎం జగన్ ఆలయ బ్రాండెడ్ శాలువాలతో పాటు లడ్డూలను ప్రధానమంత్రికి బహుమతిగా ఇచ్చారు. 2019, 2024లోనూ ఢిల్లీ పర్యటనల సందర్భంగా మోడీకి లడ్డూలను బహుకరించారు. అలాగే రామమందిరం ప్రాణ ప్రతిష్ఠా వేడుక కోసం లక్షకు పైగా తిరుపతి లడ్డూలను అయోధ్యకు తరలించారు. అయితే తాజాగా కల్తీపై స్పందించిన అయోధ్య ఆలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్.. లడ్డూలో జంతువుల కొవ్వును ఉపయోగించడంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పవిత్రతను చెడగొట్టారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
జంతువుల కొవ్వు ఉన్నాయనే ఆరోపణలు..
హిందువులు ఎంతో పవిత్రంగా పూజించే తిరుపతి లడ్డూలో నెయ్యి కల్తీ, జంతువుల కొవ్వు ఉన్నాయనే ఆరోపణలు వచ్చాయి. అందరూ భక్తితో భావించే తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందంటే ఎవరూ జీర్ణించుకోలేక పోతున్నారు. అయితే ఈ లడ్డూల కల్తీ విషయంలో తాజాగా టీటీడీ ఈవో శ్యామలరావు ప్రెస్ మీట్ నిర్వహించారు. తాను ఈవోగా నియమితులైన సమయంలో లడ్డూ నాణ్యత మీద దృష్టి పెట్టమని సీఎం తెలిపారని శ్యామలరావు అన్నారు. అలాగే లడ్డూ నాణ్యత విషయంలో కూడా భక్తుల నుంచి అనేక ఫిర్యాదులు వచ్చాయన్నారు. లడ్డూ తయారీలో స్వచ్ఛమైన ఆవు నెయ్యి ఉపయోగించకపోవడం వల్లే నాణ్యత లేదన్నారు.
శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపగా..
చాలా తక్కువ రేటుకే నెయ్యి సరఫరా చేయడంతో అనుమానం వచ్చిందన్నారు. దీంతో వెంటనే నెయ్యి విషయంలో విచారణ జరపగా.. కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయని ఈవో వెల్లడించారు. తమిళనాడుకి చెందిన ఏఆర్ డైరీ ఫుడ్స్ అనే సంస్థకు గత మార్చి నెల నుంచి కాంట్రాక్ట్ ఇచ్చినట్లు చెప్పారు. వారు కిలో నెయ్యి రూ.320కి మే నెల నుంచి సరఫరా చేశారన్నారు. అయితే మొదటిగా నాలుగు నెయ్యి ట్యాంకులు పంపించారని తెలిపారు. వీటి నుంచి తీసిన నాలుగు శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపింమన్నారు. దీంతో ఆ డెయిరీ ఫుడ్ పంపించిన నెయ్యిలో నాణ్యత లేదని తేలిందన్నారు. మొదటి టెస్ట్‌లో కూరగాయల ఫ్యాట్ ఉన్నట్లు తేలిందని.. రెండవ పరీక్షలో పంది మాంసం కొవ్వుతో పాటు ఇతర జంతువుల కొవ్వులు కూడా ఉన్నట్లు తేలిందని వెల్లడించారు.