/rtv/media/media_files/2024/12/25/jagan-at-pulivendula-church.jpeg)
Pulivendula
Pulivendula ZPTC By Elections : వైఎస్సార్ కడప జిల్లాలో గత కొద్ది రోజులుగా రాజకీయ ఉద్రిక్తత నెలకొన్నది. జిల్లాలోని పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ, వైసీపీల మధ్య రాజకీయం వేడెక్కింది. ఆరోపణలు - ప్రత్యారోపణలు, దాడులు - ప్రతిదాడులతో పులివెందులలో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తతకు దారి తీస్తోంది. ఈ రెండు స్థానాలకు ఈనెల 12న పోలింగ్ జరగనుంది. ఆదివారం సాయంత్రం ప్రచార గడువు ముగిసింది. పోలింగ్‌కు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆగస్టు 12న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది.
ఈ క్రమంలో పులివెందులలో 15, ఒంటిమిట్టలో 10 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పోలీసులు గుర్తించారు. ఆ పోలింగ్ బూత్‌లలో వెబ్‌కాస్టింగ్ చేయడంతో పాటు మైక్రో అబ్జర్వర్లను కూడా నియమించారు. అలాగే సమస్యాత్మక ప్రాంతాల్లో ఆర్మ్‌డ్ బలగాలను రంగంలోకి దించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పులివెందుల మండలాన్ని పోలీసులు జల్లడపడుతున్నారు. నల్లపురెడ్డి పల్లెలో పోలీసుల తనిఖీలు నిర్వహిస్తు్న్నారు. పులివెందుల డీఎస్పీ మురళి నాయక్ ఆధ్వర్యంలో గ్రామంలో తనిఖీల నిర్వహించారు. సమస్యాత్మక గ్రామాలను గుర్తించి ఆయా గ్రామాల్లో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు.
Also Read: ఎయిర్ ఇండియా ఫ్లైట్లకు కొత్త రూపు రేఖలు... సీట్లు, కర్టెన్ల నుంచి టాయిలెట్ల వరకు..
ప్రతిసారి గొడవలకు ఆస్కారం అవుతున్న పులివెందుల మండలాన్ని పోలీసు యంత్రాంగం దాదాపుగా తమ ఆధీనంలోకి తీసుకుంది. మండలంలోని అన్ని గ్రామాల్లో ఉన్న పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులను మోహరించారు. మండలం చుట్టూ పోలీస్ చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. పులివెందులకు వచ్చే ప్రతి వాహనాన్ని పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మండలంలోకి కొత్త వ్యక్తుల రాకను నిషేదించారు. ఎవరైనా కొత్తవాళ్లు వస్తే పసిగట్టి వారిపై అనుమానం ఉంటే అదుపులోకి తీసుకుంటున్నారు. ఉపఎన్నికలు జరుగుతున్న రెండు ప్రాంతాల్లో ఎలాంటి అల్లర్లకు పాల్పడిన కఠినంగా వ్యవహరిస్తామని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ హెచ్చరించారు.పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల నిర్వహణకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్టుగా కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ తెలిపారు. ప్రస్తుతం రెండు మండలాల్లో 30 పోలీసు యాక్ట్ అమలులో ఉందని... గుంపులుగా తిరిగితే చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎవరైనా అలర్లకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
పులివెందుల జడ్పీటీసీ స్థానంలో 10,601 ఓట్లు ఉన్నాయి. టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్సీ, నియోజకవర్గ ఇన్‌చార్జ్ బీటెక్ రవి భార్య మారెడ్డి లతా రెడ్డి పోటీ చేస్తున్నారు. వైసీపీ నుంచి దివంగత జడ్‌పీటీసీ మహేశ్వరరెడ్డి తనయుడు హేమంత్ రెడ్డి బరిలో నిలిచారు. వైసీపీ అధినేత జగన్ కుటుంబానికి పులివెందుల కంచుకోట కావడంతో... ఈ స్థానాన్ని నిలుపుకునేందుకు వైసీపీ నేతలు ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. మరోవైపు పలివెందులలో టీడీపీ కూడా విస్తృత ప్రచారం చేసింది. పులివెందుల జడ్పీటీసీ స్థానాన్ని కైవసం చేసుకోవాలనే పట్టుదలతో టీడీపీ నేతలు ఉన్నారు. ఇక, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నిక విషయానికి వస్తే... ఇక్కడ మొత్తం 24,606 ఓట్లు ఉన్నాయి. టీడీపీ నుంచి అద్దలూరు ముద్దు కృష్ణారెడ్డి, వైసీపీ నుంచి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి బరిలో నిలిచారు. ఈ స్థానంలో కూడా టీడీపీ, వైసీపీలు పోటాపోటీగా ప్రచారం నిర్వహించాయి. ఇదిలా ఉంటే, పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాల ఓట్ల లెక్కింపు ఆగస్టు 14వ తేదీన కడపలోని మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ యూనివర్సిటీలో జరగనుంది. దీంతో యూనివర్సిటీలో స్ట్రాంగ్ రూములు ఏర్పాటు చేశారు.