/rtv/media/media_files/2025/08/14/tdp-revange-2025-08-14-12-29-18.jpg)
జగన్ కంచుకోట పులివెందులలో అధికార టీడీపీ సత్తా చాటింది. జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో దాదాపు 6 వేల ఓట్ల మెజార్టీతో ఆ పార్టీ అభ్యర్థి ఘన విజయం సాధించారు. టీడీపీ అభ్యర్థి మా రెడ్డి లతా రెడ్డికి 6,735 ఓట్లు రాగా.. వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డికి 685 ఓట్లు వచ్చాయి.1978 నుంచి ఇక్కడ వైఎస్ ఫ్యామిలీ ఆధిపత్యం కొనసాగుతూ వస్తోంది. దీంతో గతంలో కుప్పంలో ఎదురైన పరాభవానికి టీడీపీ రివేంజ్ తీసుకున్నట్లు అయింది. 2021 మున్సిపల్ ఎన్నికల్లో చంద్రబాబు నియోజకవర్గం కుప్పంను టార్గెట్ చేసింది వైసీపీ. అప్పటికే అక్కడ ఏడు సార్లు ఎమ్మెల్యేగా చంద్రబాబు (1989 నుంచి..) గెలిచారు. కుప్పం మున్సిపాలిటీలో విజయం సాధించి.. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును కూడా ఓడిస్తామన్న వాతావరణం తెచ్చేందుకు వైసీపీ ప్రయత్నాలు చేసింది.
ప్రతీకారం కోసం పులివెందులను
ఆ ఎన్నికల్లో వైసీపీ తరుపున మాజీ మంత్రి పెద్దిరెడ్డి రంగంలోకి దిగి కుప్పం గెలుపుకోసం విశ్వ ప్రయత్నం చేశారు. హోరాహోరీగా సాగిన ఆ ఎన్నికల్లో 19 వార్డుల్లో వైసీపీ విజయం సాధించగా కేవలం ఆరు వార్డులకే టీడీపీ పరిమితమైంది. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అనే చెప్పుకునే చంద్రబాబుకు కుప్పంలో ఘోర పరాభవం అంటూ వైసీపీ ఎద్దేవా చేసింది. దీంతో ప్రతీకారం కోసం టీడీపీ పులివెందులను ఎంచుకుంది. 1978 నుంచి వైఎస్ ఫ్యామిలీకి కంచుకోటగా ఉంది పులివెందుల (దాదాపు 13 సార్లు విజయం). ఇక్కడ గెలిచి జగన్ పని అయిపోయిందన్న భావన తీసుకురావాలని టీడీపీ వ్యూహాలు రచించింది. కేవలం పదవీ కాలం ఏడాదే ఉన్నా.. ఈ బైపోల్ ను సీరియస్ గా తీసుకుంది టీడీపీ. ఇప్పుడు గెలిస్తే మరో ఏడాదిలో వచ్చే స్థానిక ఎన్నికల్లోనూ సత్తా చాటొచ్చని స్కెచ్ వేసింది.