ఏపీలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం దుమారం రేపుతోంది. వైసీపీ హయాంలో జంతవుల నుంచి తయారుచేసిన నూనెను లడ్డూ తయారీలో వాడారంటూ సీఎం చంద్రబాబు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయాన్ని NDDB CALF ల్యాబ్ ధృవీకరించిందనట్లు తాజాగా టీడీపీ బయటపెట్టింది. 2024, జులై 8న లడ్డులో కలిపిన నెయ్యి శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపించగా.. జులై 17న ల్యాబ్ రిపోర్టు ఇచ్చింది. నెయ్యిలో సోయాబిన్, పొద్దు తిరుగుడు, ఆలివ్, గోధుమ బిన్, మొక్కజొన్న, పత్తి గింజల నూనెతో సహా.. ఫిష్, ఆయిల్, పామాయిల్, గొడ్డు కొవ్వు వాడినట్లు తేలిందని టీడీపీ సీనియర్ నేత ఆనం వెంకట రమణారెడ్డి తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో నెయ్యి కొనుగోళ్లలో ఎలాంటి నాణ్యత ప్రమాణాలు పాటించలేదని మండిపడ్డారు.
Also Read: మాజీ మంత్రి బాలినేనికి కూటమి షాక్
ఇదిలాఉండగా.. వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీ చేసేందుకు నెయ్యికి బదులు జంతు నూనె వాడినట్లు తమ దృష్టికి వచ్చిందని సీఎం అన్నారు. తిరుపతి ప్రసాదాన్ని గత ప్రభుత్వం అపవిత్రం చేసిందని మండిపడ్డారు. నాసిరకమైన సరకులు వాడటమే కాకుండా నెయ్యికి బదులు యానిమల్ ఫ్యాట్ వాడినట్లు తెలిసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. స్వచ్ఛమైన నెయ్యిని తీసుకొచ్చి లడ్డూ ప్రసాదం తయారీ చేసేందుకు వాడుతున్నామని చెప్పారు. ఇలాంటి విషయాలు విన్నప్పుడు బాధగా అనిపించిందని.. ప్రస్తుతం లడ్డూ ప్రసాదంలో, అన్నదానంలో నాణ్యతను పాటిస్తున్నామని చెప్పారు. నాణ్యతను మరింత పెంచుతామని పేర్కొన్నారు.