రెండు అరటిపళ్లు తెచ్చిన గొడవ.. కాలేజీలో సీరినయర్స్, జూనియర్స్ మధ్య రాళ్ల యుద్ధం

ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా నాగార్జున సాగర్‌లోని APRJC కళాశాలలో విద్యార్థుల మధ్య జరిగిన స్వల్ప వివాదం రణరంగానికి దారితీసింది. విద్యార్థులు రాళ్లు విసురుకుంటూ దాడులకు దిగడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

New Update
stones

ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా నాగార్జున సాగర్‌లోని APRJC కళాశాలలో విద్యార్థుల మధ్య జరిగిన స్వల్ప వివాదం చిలికి చిలికి రాళ్ల వానలా మారింది. ఇంటర్ కాలేజీ హాస్టల్‌లో జూనియర్స్, సీనియర్స్ గ్యాంగ్‌ల విడిపోయి పరస్పరం రాళ్ల దాడి చేసుకున్నారు. విద్యార్థులు రాళ్లు విసురుకుంటూ దాడులకు దిగడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

ఈ ఘర్షణకు వెనుక ఉన్న కారణం వినడానికి వింతగా ఉన్నా, అది పెద్ద హింసకు దారితీసింది. భోజన సమయంలో మెస్‌లో ఒక విద్యార్థికి  రెండు అరటిపళ్లు ఇవ్వడంపై సీనియర్, జూనియర్ విద్యార్థుల మధ్య మాట మాట పెరిగింది. ఇది కాస్తా ముదిరి ఇరు వర్గాలు పరస్పరం దాడులు చేసుకునే వరకు వెళ్లింది. కోపంతో ఊగిపోయిన విద్యార్థులు బయట ఉన్న రాళ్లను తీసుకొని ఒకరిపై ఒకరు విసురుకున్నారు.

గాయపడ్డ విద్యార్థులు, లెక్చరర్
ఈ రాళ్ల దాడిలో ఐదుగురు జూనియర్ విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. రక్తం ఓడుతున్న విద్యార్థులను చూసి తోటివారు భయాందోళనకు గురయ్యారు. గొడవ తీవ్రతను గమనించిన ఒక లెక్చరర్, వారిని వారించేందుకు మధ్యలోకి వెళ్లారు. అయితే, ఆవేశంలో ఉన్న విద్యార్థులు విసిరిన రాళ్లు తగిలి సదరు లెక్చరర్‌కు కూడా గాయాలయ్యాయి. వెంటనే సమాచారం అందుకున్న కళాశాల యాజమాన్యం గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు.

ప్రిన్సిపాల్ స్పందన
ఈ ఘటనపై కళాశాల ప్రిన్సిపాల్ సరోజిని స్పందిస్తూ.. విద్యార్థుల మధ్య జరిగిన ఈ గొడవ అత్యంత దురదృష్టకరమని పేర్కొన్నారు. చిన్న విషయానికే విద్యార్థులు ఇంతలా రెచ్చిపోవడం ఆందోళన కలిగించే విషయమని ఆమె అన్నారు. గొడవకు బాధ్యులైన విద్యార్థులను గుర్తించామని, వారికి మరియు వారి తల్లిదండ్రులకు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చామని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. ప్రస్తుతం కళాశాలలో పరిస్థితి అదుపులోనే ఉంది. ఈ ఘటన నేపథ్యంలో విద్యార్థుల ప్రవర్తనపై తల్లిదండ్రులు మరియు విద్యావేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు