Sri Reddy: ప్రముఖ నటి, సోషల్ మీడియా స్టార్ శ్రీ రెడ్డి మరో సంచలన పోస్టుతో వార్తల్లో నిలిచింది. ఏపీలో అసభ్యకర పోస్టులు పెట్టిన వైసీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్‌లు చేస్తున్న విషయం తెలిసిందే. కాగా దీనిపై స్పందించిన శ్రీ రెడ్డి.. కూటమి ప్రభుత్వం తనను క్షమించాలంటూ ఆసక్తికర పోస్ట్ పెట్టింది. ఈ మేరకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హోంమంత్రి అనిత, మంత్రి లోకేశ్‌తో పాటు వారి కుటుంబ సభ్యులు తనను క్షమించాలని కోరింది. తానుకూడా వారందరిపై సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టానని, ఇక నుంచి అలా చేయనని చెప్పింది. ఇక తనతోపాటు వైసీపీ కార్యకర్తలను కూడా క్షమించి వదిలేయాలని కోరడం విశేషం. ఇందుకు సంబంధించిన పోస్ట్ వైరల్ అవుతోంది. టీడీటీ, జనసేన కార్యకర్తలు భిన్నమైన కామెంట్స్ చేస్తూ శ్రీరెడ్డిపై విమర్శలు గుప్పిస్తున్నారు.
రవీందర్‌రెడ్డి కోసం గాలింపు..
ఇదిలా ఉంటే.. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్‌రెడ్డి కోసం వైఎస్సార్ జిల్లా పోలీసుల గాలిస్తున్నారు. 4 ప్రత్యేక బృందాలు అతడి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు. హైదరాబాద్, బెంగళూరుతో పాటు కమలాపురం, పులివెందుల ప్రాంతాలకు పోలీసు బృందాలు వెళ్లాయి. వర్రా రవీందర్‌రెడ్డి వాడే రెండు ఫోన్లూ స్విచ్చాఫ్‌లో ఉన్నాయని, అన్ని రకాలుగా నిఘా పెట్టామని పోలీసు అధికారులు తెలిపారు.