Scrub typhus : ఏపీలో స్క్రబ్‌ టైఫస్ డేంజర్‌ బెల్స్‌..వింత వ్యాధితో ప్రజల్లో టెన్షన్‌..టెన్షన్‌

ఆంధ్రప్రదేశ్‌లో తాజాగా ఓ ప్రమాదకరమైన జ్వరం మెల్లగా పంజా విసురుతోంది. సాధారణ జ్వరం లా మొదలై, గంటల్లోనే శరీరాన్ని నిర్వీర్యం చేస్తున్న ఈ వ్యాధి పేరు ఇప్పుడు హడలెత్తిస్తోంది. అదే స్క్రబ్ టైఫస్‌. ఇప్పటికే స్ర్కబ్ టైఫస్ లక్షణాలతో పలువురు మృతి చెందారు.

New Update
FotoJet - 2025-12-04T103851.364

Scrub typhus danger bells in the state

Scrub typhus : ఆంధ్రప్రదేశ్‌లో తాజాగా ఓ ప్రమాదకరమైన జ్వరం మెల్లగా పంజా విసురుతోంది. సాధారణ జ్వరం లా మొదలై, గంటల్లోనే శరీరాన్ని నిర్వీర్యం చేస్తున్న ఈ వ్యాధి పేరు ఇప్పుడు హడలెత్తిస్తోంది. అదే స్క్రబ్ టైఫస్‌. రాష్ట్రం మొత్తం మీద ఇప్పటికే పదుల సంఖ్యలో కేసులు నమోదవుతుండగా, ఇప్పటికే స్ర్కబ్ టైఫస్ లక్షణాలతో ముగ్గురు మృతి చెందగా మరొకరు సీరియస్‌ కండీషన్‌లో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.  దీంతో ప్రజల్లో తీవ్రమైన భయాందోళనను రేకెత్తించింది. చిత్తూరు, కాకినాడ, విశాఖ, విజయనగరం జిల్లాల్లో  వ్యాధి కేసులు బయటపడ్డాయి. విశాఖలో అయితే రెండు నెలల్లో 43 పాజిటివ్ కేసులు రికార్డ్‌ అయ్యాయి. దీనికి సంబంధించి విశాఖ కేజీహెచ్ వైరాలజీ ల్యాబ్‌లో ప్రైమరీ టెస్టులు నిర్వహిస్తున్నారు.

ఇదే సమయంలోనే పల్నాడు జిల్లాలో స్క్రబ్‌ టైఫస్‌ కలకలం రేపింది. పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం రుద్రవరం గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థిని జ్యోతి జ్వరం, ఒళ్లునొప్పులతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 20 రోజుల క్రితం మరణించింది. రాజుపాలెంకు చెందిన వృద్ధురాలు నాగమ్మ కూడా జ్వరంతో చికిత్స పొందుతూ 20 రోజుల క్రితం మృతి చెందింది. ఇప్పుడు రాజుపాలెం మండలం కొత్తూరుకు చెందిన సాలమ్మ అనే మరో వృద్ధురాలు కూడా స్క్రబ్ టైఫస్ లక్షణాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతుండడం టెన్షన్‌ పెడుతోంది. అయితే పల్నాడు జిల్లాలో కొద్దిరోజుల క్రితం ప్రాణాలు కోల్పోయిన జ్యోతి, నాగమ్మ శాంపిల్స్‌ను టెస్టుల కోసం ముంబై పంపగా స్క్రబ్ టైఫస్‌తో మృతి చెందినట్లు తేలడంతో స్థానికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. 

ఇక స్క్రబ్‌ టైఫస్‌ బారినపడి విజయనగరంలోనూ మూడు రోజుల క్రితం ఓ మహిళ ప్రాణాలు కోల్పోయారు. నల్లిని పోలిన ఓ కీటకం కుట్టడంతో ఈ వ్యాధి సోకుతుందని వైద్యులు తెలిపారు. శరీరంపై ఒకచోట దద్దులు రావడంతోపాటు నల్లటి మచ్చ ఏర్పడితే స్క్రబ్ టైఫస్‌ లక్షణంగా గుర్తించాలన్నారు. మొదట్లో తీవ్ర జ్వరం, వాంతులు, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, పొడిదగ్గు లక్షణాలు కనిపిస్తాయని విశాఖ కేజీహెచ్‌ సూపరింటెండెంట్‌ వాణి తెలిపారు. మరోవైపు ఎలుకలు సంచరించే ప్రాంతాలు, పొలాలు, పొదలు, గడ్డివాములు ఉండే చోట్ల స్క్రబ్‌ టైఫస్‌ పురుగు ఆనవాళ్లుంటాయి. ఇళ్లల్లో పాత మంచాలు, పరుపులు, దిండ్లలోకి చొరబడే ప్రమాదం ఉంది. మొత్తంగా చిత్తూరు, కాకినాడ, విశాఖ, విజయనగరం, పల్నాడు జిల్లాల్లో వరుసగా స్క్రబ్ టైఫస్ పాజిటివ్‌ కేసులు నమోదు అవుతుండడం రాష్ట్రప్రజలను టెన్షన్‌ పెడుతోంది. 

ఇప్పటికే రాష్ట్రంలోని 26 జిల్లాల్లో ఈ వ్యాధి ఆనవాళ్లు బయటపడ్డాయి. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా కేసులు నమోదు కాగా, కాకినాడ, విశాఖ, కడప, నెల్లూరు, అనంతపురం, తిరుపతి, కర్నూలు, విజయనగరం, అనకాపల్లి, శ్రీకాకుళం, గుంటూరు, నంద్యాల వంటి ప్రాంతాల్లోనూ స్క్రబ్ టైఫస్ పెరుగుతున్నట్లు అధికారుల సమాచారం. పరిస్థితి తీవ్రతను గ్రహించిన వైద్య శాఖ పూర్తిస్థాయి అప్రమత్తత ప్రకటించింది. గ్రామాల వారీగా అవగాహన కార్యక్రమాలు, జ్వరం స్క్రీనింగ్ క్యాంపులు నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. వైద్యులు ఒక విషయాన్ని గట్టిగా చెబుతున్నారు .. జ్వరం రెండు, మూడు రోజులకు మించి కొనసాగితే నిర్లక్ష్యం చేయకూడదు. శరీరంపై ఎక్కడైనా నల్లటి గాయం కనిపిస్తే, దుర్వాసన వస్తే, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే వెంటనే సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రిని ఆశ్రయించాలి. సరైన సమయంలో చికిత్స అందిస్తే మరణాల శాతం రెండు శాతం లోపే ఉంటుందంటున్నారు. కానీ ఊపిరితిత్తుల వరకు ఇన్ఫెక్షన్ వెళ్లితే పరిస్థితి చేయి దాటే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

అయితే దీనికి భయం అవసరం లేదంటున్నారు వైద్యులు.. జాగ్రత్త మాత్రం తప్పనిసరి. తడి ప్రాంతాల్లో, పొలాల్లో, చెత్త ఉన్న చోట్ల తిరిగేటప్పుడు రక్షణ చర్యలు పాటించడం, శరీరంపై ఏ చిన్న మార్పు కనిపించినా నిర్లక్ష్యం చేయకుండా పరీక్ష చేయించుకోవడం చాలా కీలకమని చెబుతున్నారు. ప్రభుత్వ వైద్యులు సమయానికి చేరితే స్క్రబ్ టైఫస్‌ను కట్టడి చేయవచ్చని ఆరోగ్య శాఖ స్పష్టం చేస్తోంది. కాగా, రాష్ట్రంలో స్క్రబ్‌ టైఫస్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. స్క్రబ్‌ టైఫస్‌ కేసుల నమోదుపై వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి సౌరభ్‌ గౌర్‌తో ముఖ్యమంత్రి తాజాగా సమీక్షించారు. ఇటీవల విజయనగరం జిల్లాలో స్క్రబ్‌ టైఫస్‌ బారినపడి చందక రాజేశ్వరి అనే మహిళ మృతిచెందిందని, తరహా ఘటనలు మరెక్కడా జరగకుండా చూడాలని సీఎం  స్పష్టం చేశారు.

Advertisment
తాజా కథనాలు