Pawan Kalyan : జనసేన ఎమ్మెల్యేలపై పవన్‌ నిఘా..ఎందుకో తెలిస్తే షాక్‌

21 మంది జనసేన ఎమ్మెల్యేల్లో 10 మందిపై భూ ఆక్రమణలు, ఇసుక, మైనింగ్ దందాలు, మద్యం వ్యవహారాల ఫిర్యాదులున్నాయి. పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చే విధంగా ఆ ఎమ్మెల్యేలపై ఆరోపణలు వెల్లువెత్తుతుండటంతో పవన్ కల్యాణ్ రహస్యంగా వారి పనితీరుపై నిఘా పెట్టారట.

New Update
FotoJet - 2025-12-04T085457.156

Pawan Kalyan is keeping an eye on Jana Sena MLAs..

Pawan Kalyan : ఏపీలో  రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. అధికార కూటమిలో భాగస్వాములుగా కొనసాగుతున్న పార్టీలు కూటమిలో ఉంటూనే  సొంత బలం పెంచుకోవడంపై ఫోకస్ చేస్తున్నాయి. జనసేన చీఫ్‌ పవన్ కల్యాణ్ తాజాగా జనసేన బలోపేతంపై కసరత్తు చేస్తున్నారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు జనసేనపార్టీలో  నియామకాలపైన సేనాని ఇప్పటికే  కీలక నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా పార్టీ ఎమ్మెల్యేలు ప్రజాసేవ తప్ప ఇత రత్రా ఏ వ్యవహారాల్లో వేలు పెట్టకూడదని పవన్‌ తేల్చి చెప్పారు. ఇందులో భాగంగానే వారికి స్పష్టమైన ఆదేశాలిచ్చారు పవన్‌. ఇంతటితో ఆగకుండా రాష్ట్రంలోని ప్రతి  గ్రామ పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు అభివృద్ధి కార్యక్రమాల్లో జనసేన నేతలు, కార్యకర్తలు భాగస్వాములను చేయాలని నిర్ణయించారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యనేతల యాక్టివిటీస్‌పై నిరంతర నిఘా పెట్టి ఎప్పటికప్పుడు రిపోర్టులు తెప్పించుకునేందుకే ఈ కమిటీలు ఏర్పాటు చేసినట్టు పార్టీలో చర్చ స్టార్టైంది. ఈ విషయమై తాజాగా మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో పార్టీ ముఖ్య నేతలతో పవన్ భేటీ అయ్యారు.

తమ ప్రాంత అభివృద్ధి, అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో క్రియాశీలకంగా వ్యవహరించేలా పార్టీ శ్రేణులను ప్రభుత్వంతో పాటు ముందుకు తీసుకెళ్దామని నేతలకు పవన్‌ దిశానిర్దేశం చేశారు. జనసేన కమిటీల నిర్మాణంలో భాగంగా గ్రామస్థాయిలో ఐదుగురితో కమిటీని నియమించాలని కోరారు. గ్రామ అభివృద్ధిలో  భాగమయ్యేలా చేద్దామని పిలుపునిచ్చారు. గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గస్థాయి వరకు పార్టీ కార్యక్రమాల నిర్వహణ బాధ్యతలకు ఐదుగురు చొప్పున సభ్యులతో కమిటీలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కమిటీ పార్టీ అధిష్టానానికి ఎప్పటికప్పుడు నియోజకవర్గాల్లో నేతల పనితీరు, అభివృద్ధిపై నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు. ఇంతేకాక నామినేటెడ్‌ పదవులపైనా పవన్‌ సమీక్షించారు. రాష్ట్రస్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకు జనసేన పొందిన పదవుల వివరాలను పరిశీలించారు. మిగిలిన పదవుల భర్తీపై పలు సూచనలు చేశారు.

కూటమి ధర్మాన్ని అనుసరించి ముందుకు వెళ్లడంతో పాటు పార్టీ కోసం చిత్తశుద్ధితో పనిచేసిన వారికి వివిధ దశల్లో గుర్తింపు, బాధ్యతలు అందించేలా ప్రయాణిస్తున్నామని తెలిపారు. పార్టీ అంతర్గత వ్యవహారాలకు సంబంధించి నెలకొనే అంశాలను పరిష్కరించేందుకు ఉద్దేశించిన కాన్‌ఫ్లిక్ట్‌ మేనేజ్‌మెంట్‌ విభాగాన్ని కేంద్ర కార్యాలయం నుంచి పర్యవేక్షించా లని స్పష్టం చేశారు. ఈ విభాగంలో 11 మంది వరకు సభ్యులను నియమించాలని నిర్ణయించారు. ప్రతి కమిటీలో మహిళలకు స్థానం కల్పించాలని పేర్కొన్నారు. ఐదుగురు సభ్యులు ఉండే గ్రామస్థాయి కమిటీలో తప్పనిసరిగా ఒకరు, గరిష్ఠంగా ఇద్దరు వీర మహిళలు సభ్యులుగా ఉండాలని తెలిపారు. 11 మంది సభ్యులు ఉండే కమిటీలో ముగ్గురు వీర మహిళలకు స్థానం కల్పించాలని నిర్దేశించారు.

ఇప్పటికే ఎమ్మెల్యేలకు వార్నింగ్‌..

కూటమి ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజులకే జనసేన పార్టీలో అంతర్గత కలహాలు, అసంతృప్తి సెగలు మొదలయ్యాయి. ఒకపక్క నియోజకవర్గాల్లో టీడీపీ నేతల పెత్తనం పెరిగిపోయిందని జనసేన ఎమ్మెల్యేలు గుర్రుగా ఉంటే, మరోవైపు ఎమ్మెల్యేల పనితీరుపై పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం 21 మంది ఎమ్మెల్యేల్లో సుమారు 10 మందిపై భూ ఆక్రమణలు, ఇసుక, మైనింగ్ దందాలు, మద్యం వ్యవహారాల వంటి అనేక ఫిర్యాదులు అందినట్లు పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది. పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చే విధంగా కొంతమంది ఎమ్మెల్యేలపై ఆరోపణలు వెల్లువెత్తుతుండటంతో పవన్ కల్యాణ్ రహస్యంగా వారి పనితీరుపై నిఘా పెట్టారు.

ఇందుకోసం ఆయన ఒక ప్రముఖ సర్వే సంస్థ ద్వారా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల వ్యవహారశైలి, వారిపై వచ్చిన ఆరోపణలు, పాలనలో కుటుంబ సభ్యుల జోక్యం, భూ వివాదాల్లో తలదూర్చడం వంటి అంశాలపై ప్రత్యేక సర్వే చేయించినట్లు సమాచారం. ఈ సర్వేలో 10 మంది ఎమ్మెల్యేలపై ప్రతికూల నివేదికలు వచ్చినట్లు తెలుస్తోంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. నగరానికి చెందిన ఒకరిపై, అనకాపల్లి జిల్లాకు చెందిన మరొకరిపై భూ వివాదాలు, మద్యం వ్యవహారాలు, ఇతర దందాలకు సంబంధించిన ఆరోపణలు ఉన్నట్లు నేతలు గుసగుసలాడుకుంటున్నారు.

ముఖ్యంగా, అనకాపల్లి జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే నియోజకవర్గంలో దందాల్లో ఆరితేరిపోయారని, పరిశ్రమల నుంచి సొంత ట్యాక్స్‌లు వసూలు చేస్తున్నారని పవన్‌కు తెలిసింది. భూ వివాదాల్లో జోక్యం చేసుకుంటున్నారని, అధికారులపై దుర్భాషలాడుతున్నారని  ఫిర్యాదులు అందాయి. ఎమ్మెల్యే ప్రత్యేక ట్యాక్స్‌లపై ఒక భారీ పారిశ్రామికవేత్త పవన్ కల్యాణ్ వద్ద పెద్ద పంచాయతీ పెట్టినట్లు తెలుస్తోంది. దీనిపై పవన్ కల్యాణ్ సదరు ఎమ్మెల్యేపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి మందలించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.ఈ నేపథ్యంలో తాజాగా వేస్తున్న ఐదుగురు సభ్యుల అభివృద్ధి కమిటీలు ఎమ్మెల్యేలను నీడలా వెంటాడుతూ పార్టీ పెద్దలకు ఎప్పటికప్పుడు రిపోర్టులిచ్చేందుకేనని చర్చ జరుగుతోంది. 

Advertisment
తాజా కథనాలు