పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో హైటెన్షన్ నెలకొంది. లూథరన్ చర్చిలో పాస్టర్ల మధ్య ఆధిపత్య పోరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. చర్చిలో అందరూ చూస్తు్ండగానే రెండు వర్గాలు పొట్టు పొట్టు కొట్టుకున్నాయి. ఆదివారం ప్రార్థన చేసేందుకు పాస్టర్లు చంద్రశేఖర్, నవ కుమార్ పోటీ పడినట్లుగా తెలుస్తోంది. నేనంటే నేనే అంటూ గొడవకు దిగారు. దీంతో పాస్టర్లకు మద్దతుగా చర్చి కమిటీ సభ్యులు రెండుగా విడిపోయారు. ప్రార్థన సమయంలో ఈ రెండు వర్గాలు కొట్టుకున్నారు.
సోషల్ మీడియాలో వైరల్
చొక్కాలు చింపుకునే వరకు పరిస్థితి వెళ్లింది. ఆడవాళ్లు ఉన్నారని కూడా పట్టించుకోలేదు. దేవుడి సమక్షంలో రెండు వర్గాలు తన్నుకోవడం చూసిన భక్తులు ముక్కున వేలేసుకున్నారు. దీంతో అక్కడ హైటెన్షన్ నెలకొంది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని రెండు వర్గాలకు నచ్చజెప్పి గొడవను సద్దుమణిగించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కాగా స్థానికంగా ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది.