శ్రీవారి లడ్డూ కల్తీ పాపం జగన్‌కి చుట్టుకుంటుంది.. మండిపడ్డ ఎంపీ

తిరుమల లడ్డూ వివాదంపై నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి స్పందించారు. లడ్డూలో చేప నూనె, జంతువుల మాంసం వంటివి ఉపయోగించడం పాపమన్నారు. ఈ పాపమంతా జగన్‌కే చుట్టుకుంటుందని బైరెడ్డి శబరి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

author-image
By Kusuma
New Update
Tirumala laddu

 

తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందనే ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఇదే చర్చ కొనసాగుతోంది. ఈ ఆరోపణలపై నంద్యాల ఎంపీ బైరడ్డి శబరి స్పందించారు. మాజీ సీఎం వైఎస్ జగన్‌పై మండిపడ్డారు. కోరిన కోరికలు నెరవేర్చే ఏడుకొండల స్వామి ఆలయం చాలా పవిత్రమైనదని.. ఎలాంటి పాపాలను అయిన కడిగే వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి భక్తులు భారీ సంఖ్యలో వెళ్తుంటారన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ ఆలయానికి చాలా ప్రాముఖ్యత ఉందన్నారు. అత్యధిక ధనిక ఆలయాల్లో తిరుపతి దేవస్థానం కూడా ఒకటన్నారు. వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి కొందరు అయితే ఎన్నో నెలలు, సంవత్సరాల నుంచి కూడా వేచి ఉంటారని బైరెడ్డి అన్నారు.

హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి

 తిరుమల లడ్డూ ప్రసాదాన్ని ఇంటికి తీసుకెళ్లి పూజలు చేసి, అందరికీ పంచుతారన్నారు. ఇలాంటి లడ్డూలో జంతువుల మాంసం, చేప నూనె వంటివి ఉపయోగించడం పాపం అని బైరెడ్డి జగన్‌పై మండిపడ్డారు. ఈ తిరుపతి లడ్డూ పాపం అంతా వైఎస్ జగన్‌కే చుట్టుకుంటుందన్నారు. లడ్డూలో కల్తీ ఉన్నట్లు ల్యాబ్ టెస్ట్‌లో రిపోర్ట్‌లు రావడంతో హిందూవుల మనోభావాలు దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్త చేశారు. టీటీడీకి దేవుడిని నమ్మని వాళ్లని, హిందువులు కాని వాళ్లని చైర్మన్‌లుగా నియమించడం సరికాదని ఎంపీ బైరెడ్డి మండిపడ్డారు. మొత్తం ఏడు కొండలు ఉండే వెంకటేశ్వరుడికి ఐదు కొండలు చాలు అనే జీవో తీసుకొచ్చిన కరుణాకర్ రెడ్డి, వైవీ సుబ్బరెడ్డి కర్ణాకర్ రెడ్డి అసలు హిందుత్వాన్నే నమ్మరన్నారు. ఇలాంటి పాపం చేసిన వారిని ఆ దేవుడు విడిచిపెట్టడని ఎంపీ బైరెడ్డి అన్నారు.

Advertisment
తాజా కథనాలు