AP News: తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వివాదం వేళ టీడీపీ ఎమ్మెల్యే, ఓ కలెక్టర్ అత్యుత్సాహం ప్రదర్శించారు. దసరా ఉత్సవాల్లో భాగంగా విజయవాడలోని దుర్గమ్మ దేవస్థానం విక్రయిస్తున్న లడ్డూ, అన్నప్రసాదం తయారీని ఎలాంటి జాగ్రత్తలు పాటించకుండా తనిఖీ చేయడం వివాదాస్పదమైంది. ఈ మేరకు సోమవారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.సృజనతోపాటు భీమిలీ ఎమ్మెల్యే ఘంటా శ్రీనివాస్, పలువురు అధికారులు ప్రసాదాల తయారీకి వినియోగించే సరుకులను పరిశీలించారు. ఇందుకు సంబంధించిన ఫొటో, వీడియోలు వైరల్ అవుతుండగా వారిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నైవేధ్యం పెట్టకుండానే తింటారా..
ఈ మేరకు చేతులకు గ్లౌజ్, నెత్తి వెంట్రుకలు రాలకుండా జాలీ ధరించకుండానే తయారు చేస్తున్న ప్రసాదాన్ని రుచి చూడటంపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేవుడికి ప్రసాదం నైవేధ్యం పెట్టకుండానే ఎలా రుచి చూస్తారంటూ మండిపడుతున్నారు. పప్పులు, చక్కర వంటి పదార్థాలను చేతులు శుభ్రం చేసుకోకుండా ఎలా ముట్టుకున్నారని, దేవుడికి మొక్కకముందే ఎలా ఎంగిలి చేస్తారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.
ఫుడ్ సేఫ్టీ నిబంధనల ప్రకారమే..
ఇదిలా ఉంటే.. పదార్థాల పరిశీలన అనంతరం మీడియాతో మాట్లాడిన కలెక్టర్ సృజన.. ప్రసాదాల తయారీకి విజయ నెయ్యిని వాడుతున్నట్లు తెలిపారు. ఇక సరుకులను ఎప్పటికప్పుడు శాంపిల్స్ తీసి పరీక్షల కోసం ల్యాబ్‌లకు పంపిస్తున్నట్లు ఆలయ అధికారులు చెప్పారు. ఫుడ్ సేఫ్టీ నిబంధనల ప్రకారమే ఆహార పదార్థాలను ప్రసాదాల తయారీలో వినియోగిస్తున్నామన్నారు. ఉత్సవాల్లో రోజుకు 70 వేల వరకు లడ్డూలను విక్రయిస్తున్నామని, మూలా నక్షత్రం రోజు నుంచి లడ్డూ విక్రయాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. రోజుకు రెండు నుంచి 2.5 లక్షల లడ్డూలు తయారు చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఈ లింగం రమాదేవి, ఏఈఓ చంద్రశేఖర్, జగన్నాథరావు, ఆదినారాయణ, ఎ.కె.డి.కృష్ణ, సూపరింటెండెంట్ హేమ దుర్గాంబ, సిబ్బంది సీతారామయ్య పాల్గొన్నారు.