'వైఎస్సార్‌ జిల్లా' పేరు మార్చాలి.. చంద్రబాబుకు మంత్రి లేఖ

ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. 'వైఎస్సార్‌ జిల్లా' పేరును మార్చాలంటూ సీఎం చంద్రబాబుకు మంత్రి సత్యకుమార్‌ లేఖ రాశారు. వైఎస్సార్‌ జిల్లా పేరును "వైఎస్సార్‌ కడప" జిల్లాగా మార్చాలని ఆయన కోరారు.

New Update
Minister Satya Kumar: వ్యవస్థను ప్రక్షాళన చేసి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌ సాధిస్తాం: మంత్రి సత్యకుమార్‌

Minister Satya Kumar:  ఏపీ రాజకీయాల్లో మరోసారి పేర్ల మార్పు ప్రక్రియ తెర మీదకు వచ్చింది. గతంలో అధికారంలో ఉన్న వైసీపీ ఎన్టీఆర్ యూనివర్సిటీకి పేరును వైఎస్సార్ యూనివర్సిటీగా మారుస్తూ తీసుకున్న నిర్ణయం ఆనాడు రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే.. ఏపీలో కొలువుదీరిన కూటమి ప్రభుత్వం.. తిరిగి ఆ యూనివర్సిటీ ఎన్టీఆర్ పేరునే పెట్టింది. ఇదిలా ఉంటే తాజాగా 'వైఎస్సార్‌ జిల్లా' పేరును మార్చాలంటూ సీఎం చంద్రబాబుకు మంత్రి సత్యకుమార్‌ లేఖ రాశారు. వైఎస్సార్‌ జిల్లా పేరును కడప జిల్లాగా మార్చాలని ఆయన కోరారు. 

వైఎస్సార్‌ కడపగా...

ఆయన లేఖలో... రాయలసీమలోని కడప జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం దేవుని కడప. ఆదిమధ్యాంతరహితుడైన శ్రీనివాసుడు వెలసియున్న గొప్ప పుణ్యక్షేత్రం. ఈ ఆలయంలో శ్రీవారు శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామిగా అవతరించి ఉన్నారు. ప్రధానంగా ఈ ఆలయం హనుమత్ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. పూర్వం ఈ ప్రాంతమంతా రాక్షస నిలయంగా ఉండేది. రాక్షసొంతకుడైన హనుమంతుడు ఈ ప్రాంత వాసులకు దానవ పీడ తొలగించడానికి మశ్చ్యావతారంగా ఆవిర్భవించాడని ప్రసిద్ధి. ఆ తరువాత కృపాచార్యుల వారు తీర్థయాత్రలు చేస్తూ ఈ ప్రాంతానికి వచ్చి హనుమత్ క్షేత్రమైన ఈ క్షేత్రంలో బస చేశారు. 

అక్కడ నుండి వారు తిరుమల వెళ్లి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించాలని సంకల్పించారు. కానీ కొన్ని పరిస్థితుల వలన వారు ముందుకు సాగలేకపోయారు. శ్రీవారి దర్శనాభిలాషతో కృపాచార్యులు తపించి పోయారు. శ్రీవారి కరుణను పొందారు, స్వామి సాక్షాత్కారాన్ని పొంది కృతార్థులైనారు. శ్రీవారి కృప పొందిన ప్రదేశం కనుక వారు ఈ ప్రాంతాన్ని కృపావతిగా నామకరణం చేశారు. ఆ కృపావతి కురుపగా, కుడపగా క్రమేపి కడపగా ప్రసిద్ధి చెందింది. శ్రీవారి దర్శనాన్ని పొందిన కృపాచార్యులు తన్న వలే తిరుమల క్షేత్రానికి వెళ్లలేని నిస్సహాయుల కొరకు తిరుమల శ్రీవారి ప్రతిరూపాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు. శ్రీవారి ఆదేశానుసారం హనుమంతుడి విగ్రహం ముందు ప్రతిష్టించబడిన శ్రీ వెంకటేశ్వర స్వామి భక్త వత్సలుడై ఇక్కడ పూజలు అందుకుంటున్నాడు. 

నాటి నుంచి తిరుమల శ్రీవారిని దర్శించడానికి వెళ్లే భక్తులు ముందుగా దేవుని కడప శ్రీవారిని దర్శించి తిరుమలకు వెళ్లడం ఆచారంగా మారిపోయింది. ఇంతటి గొప్ప చారిత్రక నేపథ్యం, ఆధ్యాత్మిక ప్రాశస్త్యం ఉన్న కడప పేరును గత ప్రభుత్వం అవగాహనరాహిత్యంతో వైయస్సార్ జిల్లాగా పేరు మార్చడం జరిగింది. దీనితో శ్రీవారి భక్తుల మనసులు నొచ్చుకున్నా భయం చేత ఎవరూ తమ అభిప్రాయాలను బయటపెట్టలేదు. నేను గతంలో శాసనసభలో ఇదే విషయాన్ని ప్రస్తావించాను. డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కడప జిల్లా అభివృద్ధికి కృషి చేశారన్నది ఎవ్వరూ కాదనలేని సత్యం. కాబట్టి కడప చారిత్రక నేపథ్యాన్ని, డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో జరిగిన అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని నేడు వైయస్సార్ జిల్లాగా పిలవబడుతున్న ఈ జిల్లాను "వైయస్సార్ కడప" జిల్లాగా మార్చవలెనని మనవి చేసుకుంటున్నాను." అని లేఖలో ప్రస్తావించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు