/rtv/media/media_files/2025/10/22/ab-venkateswara-rao-fires-on-mega-krishnareddy-2025-10-22-20-59-58.jpg)
AB Venkateswara Rao Fires On Mega Krishnareddy
Polavaram-Banakacharla : పోలవరం -బనకచర్ల ప్రాజెక్టు పేరిట మేఘా కంపెనీకి వేల కోట్లు దోచిపెట్టేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైందని రిటైర్డ్ ఐపీఎస్, ఆలోచనాపరుల వేదిక సభ్యులు ఏబీ వెంకటేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం నాడు రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులపై అవిశ్రాంతంగా కృషి చేసిన ఇంజనీర్ ఎం సుబ్బారాయుడు సంస్మరణ సభ విజయవాడలో జరిగింది. ఈ కార్యక్రమంలో ఏబీ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రధాన సమస్యలు పక్కన పెట్టిన ప్రభుత్వం కుల గొడవలు, హత్యల మీద దృష్టి పెడుతోందని అన్నారు.
రాష్ట్రంలో అసంపూర్ణంగా మిగిలిపోయిన ప్రాజెక్టులు ఎలా పూర్తిచేయాలో ఆలోచించకుండా.. కూటమి ప్రభుత్వం పోలవరం-బనకచర్ల అంటూ మొండి వైఖరితో ముందుకెళుతోందని విమర్శించారు. తాజాగా పోలవరం -బనకచర్ల డీపీఆర్ తయారీ కోసం పేపర్‌లో ప్రకటన ఇచ్చారని తెలిపారు. ప్రకటన అయితే ఇచ్చారు కానీ.. ఈ ప్రొక్యూర్‌మెంట్ సైట్‌లో ఎలాంటి వివరాలు అప్‌లోడ్ చేయలేదని తెలిపారు. సంబంధిత విభాగానికి ఫోన్ చేసి అడిగితే తమకు వివరాలు రాలేదని.. వస్తే అప్‌లోడ్ చేస్తామని తెలిపారన్నారు. పేపర్‌లో ప్రకటన ఇచ్చిన ప్రభుత్వం.. సైట్‌లో వివరాలు అప్‌లోడ్ చెయ్యకపోతే కాంట్రాక్టర్లు టెండర్లు ఎలా వేస్తారని ప్రశ్నించారు. అక్టోబర్ 22 (బుధవారం) అఖరి తేదీ అని.. అయినా టెండర్లు ప్రొక్యూర్‌మెంట్ సైట్‌లో కనిపించలేదన్నారు.
అంటే ప్రభుత్వం ముందే మేఘా కృష్ణారెడ్డికి దోచిపెట్టేందుకు ఆయనతో ఒప్పందం కుదుర్చుకుందా అని ప్రశ్నించారు. డీపీఆర్ పేరిట రూ.9.2 కోట్లు మేఘాకు కట్టబెట్టేందుకు ముందే సిద్ధమై.. కేవలం పేపర్‌లో చిన్న ప్రకటన ఇచ్చారా..? అని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం రహస్యంగా పోలవరం - బనకచర్ల ప్రాజెక్టు కట్టాలని అనుకుంటుందా? అని ప్రశ్నించారు. లేదంటే మేఘా కృష్ణారెడ్డి లాంటి వాళ్లకి వేల కోట్లు దోచిపెట్టేందుకు రహస్యంగా ప్రకటనలు ఇస్తున్నారా..? అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వానికి రాష్ట్ర ప్రయోజనాల కంటే వ్యక్తిగత ప్రయోజనాలే ముఖ్యమయ్యాయని విమర్శించారు.
రూ.750 కోట్లు అప్పనంగా కట్టబెట్టిన జగన్..
గత వైసీపీ ప్రభుత్వంలోనూ మేఘా కృష్ణారెడ్డికి వందల కోట్ల రూపాయలు దోచిపెట్టారని ఏబీ వెంకటేశ్వరరావు విమర్శించారు. రాయలసీమ ప్రాజెక్టులను ఒక్క అడుగు కూడా ముందుకు తీసుకెళ్లలేదని తెలిపారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం పేరుతో గుంతలు తవ్వడానికి రూ.750 కోట్లు మేఘా కృష్ణారెడ్డికి అప్పనంగా కట్టబెట్టారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం కూడా అదే దారిలో ప్రయాణిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా మేఘాకు దోచిపెట్టుకుంటూ పోతుంటే రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులు ఎప్పటికి పూర్తవుతాయని ప్రశ్నించారు. ఆలోచనా వేదిక తరపున రాష్ట్రంలోని ప్రాజెక్టులన్నిటినీ పరిశీలిస్తామని ప్రజలకు వాస్తవాలు వివరిస్తామని తెలిపారు.
Also Read: Prabhas Fauji: "మోస్ట్ వాంటెడ్ సిన్స్ 1932".. ప్రభాస్ ప్రీ-లుక్ పోస్టర్ అదిరిపోయింది👌