AP : ఏపీలో ని మందుబాబులకు ఏపీ సర్కార్ ఓ బ్యాడ్ న్యూస్ చెప్పింది. అది ఏంటంటే..ఏపీలో పది రోజుల పాటు మద్యం దుకాణాలు బంద్ చేస్తున్నట్లు తెలిపింది. అసలే రేపు దుకాణాలు బంద్ అంటేనే ముందు రోజే షాపుల ముందు బారులు తీరి మరీ తమకు కావాల్సిన సరుకును తెచ్చి ఇంట్లో పెట్టేసుకుంటారు.
అయితే ఏపీలో మందుబాబులకు ఈ విషయంలో షాక్ తగిలింది. అక్టోబర్ రెండు గాంధీ జయంతి ఒక్కరోజే మద్యం షాపులు బంద్ అవుతాయని అనుకున్న చాలా మందికి.. ఊహించని మరో గట్టి షాక్ తగిలింది. ఏకంగా పదిరోజుల పాటు మద్యం దుకాణాలు బంద్ అయ్యే పరిస్థితి వచ్చింది. దీంతో మందుబాబులు తీవ్ర ఆందోళనకు గురౌతున్నారు. నూతన మద్యం పాలసీ కారణంగా తక్కువ ధరకే నాణ్యమైన బ్రాండ్లు రుచి చూడొచ్చని అనుకుంటే.. ఇదేంటి ఇలా అయ్యిందంటూ తమ బాధను ఇంట్లో ఖాళీ అయిన సీసాలతో చెప్పుకుంటున్నారు.
అయితే అసలు సంగతి ఏంటంటే.. ఏపీ ప్రభుత్వం అక్టోబర్ 12 నుంచి నూతన మద్యం విధానం అమలు చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. వైసీపీ ప్రభుత్వం హయాంలో ప్రభుత్వమే మద్యం దుకాణాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కొత్త మద్యం పాలసీ ప్రకారం మద్యం షాపులను ప్రైవేట్ వ్యక్తులు నిర్వహించనున్నారు. దీంతో ఇప్పటి వరకూ ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పనిచేసిన కాంట్రాక్టు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీరందరి కాంట్రాక్టు సెప్టెంబర్ 30తోనే ముగిసింది.
ఇంకో పది రోజుల్లో నూతన మద్యం పాలసీ అమల్లోకి రానుంది. దీంతో పదిరోజుల తర్వాత తమకు ఉద్యోగాలు ఉండవని ఆందోళన చేస్తున్నారు. మద్యం దుకాణాలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తే తమ గతేంకానంటూ నిరసనలకు దిగుతున్నారు. ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించాలని.. తమకు ఓ దారి చూపాలని డిమాండ్ చేస్తున్నారు.
మరోవైపు ఈ పదిరోజులూ మద్యం దుకాణాలు తెరవాలని ప్రభుత్వం కోరినప్పటికీ.. ఇప్పటి నుంచే కాంట్రాక్టు ఉద్యోగులు దుకాణాలకు రావటం మానేశారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల మద్యం దుకాణాలు తెరుచుకోలేదు. ఇక రేపు అక్టోబర్ రెండో తేదీ గాంధీ జయంతి కావటంతో పూర్తిస్థాయిలో మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. ఆ తర్వాత కూడా కాంట్రాక్టు సిబ్బంది వల్ల.. మరో పదిరోజులు లిక్కర్ షాపులు బంద్ అయ్యే పరిస్థితి ఉంది. దీంతో మందుబాబులు తెగ ఫీలవుతున్నారు.
Also Read: దసరా వేళ టీజీఆర్టీసీ తీపి కబురు..ఇక నుంచి ఇంటింటికి..!