/rtv/media/media_files/2026/02/03/janasena-2026-02-03-19-38-54.jpg)
జనసేన పార్టీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆవిర్భావం నుండి ఆ పార్టీ చీఫ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెంట ఉన్న సీనియర్ నేత బొలిశెట్టి సత్యనారాయణ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీలో తాను నిర్వహిస్తున్న అన్ని పదవుల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు తనను బాధ్యతల నుంచి తప్పించాలని కోరుతూ పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ఆయన ఒక లేఖ రాశారు. బొలిశెట్టి ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధానంగా నైతికత,పర్యావరణం కారణమని తెలుస్తోంది.
పర్యావరణ న్యాయం కోసం తన పర్యావర ప్రధాన కార్యదర్శి పదవి నుండి ఇతర అనుబంధ పదవుల నుండి బయటకు వస్తున్నాను
— Bolisetty Satyanarayana (@bolisetti_satya) February 3, 2026
ఎందుకు?
ఆంధ్రప్రదేశ్‌లో కాలుష్యానికి సంబంధించి దాఖలైన ఒక ప్రధాన పర్యావరణ ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL 248/2020)లో నేను పిటిషనర్‌గా ఉన్నాను. ఈ నేపథ్యంలో నేను "నైతిక విరామం"… pic.twitter.com/Vsa5MtAOYf
ఏపీ కాలుష్యానికి సంబంధించి హైకోర్టులో దాఖలైన ఒక పర్యావరణ కేసులో బొలిశెట్టి పిటిషనర్‌గా ఉన్నారు. ప్రస్తుతం జనసేన పార్టీ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది. పైగా పవన్ కళ్యాణ్ స్వయంగా పర్యావరణ శాఖ మంత్రిగా ఉన్నారు. ప్రభుత్వంపై కేసు వేసిన వ్యక్తిగా, అదే ప్రభుత్వంలో ఉన్న పార్టీలో కీలక పదవిలో ఉండటం సరికాదని ఆయన భావించారు.గతంలో అమరావతి రాజధాని పర్యావరణ విషయాలపై మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు చేసిన విమర్శలు కూడా ఈ నిర్ణయానికి ఒక కారణమని సమాచారం.
నైతిక విరామం మాత్రమే
తన నిర్ణయంపై స్పందించిన బొలిశెట్టి, ఇది పార్టీకి రాజీనామా కాదని, కేవలం పదవుల నుంచి తీసుకుంటున్న నైతిక విరామం మాత్రమేనని స్పష్టం చేశారు. పర్యావరణ న్యాయం కోసం జరుగుతున్న పోరాటం రాజకీయ కారణాల వల్ల ఆగిపోకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. కోర్టులో సమస్యలు పరిష్కారమైన తర్వాత, పార్టీ కోరుకుంటే మళ్ళీ బాధ్యతలు చేపడతానని, జనసేన సిద్ధాంతాలకు తాను ఎప్పుడూ కట్టుబడే ఉంటానని లేఖలో పేర్కొన్నారు. మొత్తానికి జనసేనలో సుదీర్ఘ కాలం పనిచేసిన బొలిశెట్టి సత్యనారాయణ పదవుల నుంచి తప్పుకోవడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
Follow Us