మాజీ ఎంపీ ప్రస్తుత ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణమరాజును కస్టడీలో టార్చర్ చేశారన్న కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీఐడీ మాజీ అదనపు ఎస్పీ విజయ్‌పాల్‌ను ఇవాళ (మంగళవారం) పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.
రఘురామ కృష్ణంరాజుపై థర్డ్ డిగ్రీ?
గత వైసీపీ హయాంలో రఘురామ కృష్ణంరాజును అక్రమంగా అరెస్టు చేయడంతో పాటు ఆయనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన కేసులో అప్పటి సీఐడీ ఏఎస్పీ విజయపాల్ విచారణను ఎదుర్కొంటున్నారు. ఇందులో భాగంగానే ఆయన ఇవాళ ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ ఆయనను విచారించారు.
Also Read: అక్కినేని అఖిల్ ఎంగేజ్మెంట్ .. ప్రకటించిన నాగార్జున
ఇవాళ (మంగళవారం) ఉదయం 11 గంటల నుంచి విచారించిన పోలీసులు.. అనంతరం రాత్రి 7 గంటల సమయంలో విజయ్ పాల్‌ను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఆయనను విచారించడం ఇది మొదటిసారి కాదు. ఇదివరకు ఈ నెల 13న కూడా ఇక్కడే విచారణ జరిపారు. అప్పుడు 50 ప్రశ్నలకు ముక్తసరిగా సమాధానాలు చెప్పారు. అడిగిన ప్రతి ప్రశ్నకు ఏమో తెలియదు, మరిచిపోయా, గుర్తులేదు అంటూ చెప్పుకొచ్చినట్లు తెలిసింది.
ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ విజయ్ పాల్ ఇటీవల దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీంతో విజయ్ పాల్ ఇవాళ ప్రకాశం జిల్లా పోలీసుల విచారణకు హాజరయ్యారు. చాలా సమయం విచారణ అనంతరం విజయ్ పాల్‌ను అరెస్ట్ చేసినట్లు సమాచారం. దీనిపై మరికాసేపట్లో పోలీసులు అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.
కేసు ఏంటి?
గత వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డిపై రఘురామకృష్ణం రాజు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ సీఐడీ అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అక్కడితో ఆగకుండా హైదరాబాద్‌లో ఉన్న రాఘురామ నివాసం నుంచి ఆయన్ను తీసుకువచ్చి గుంటూరు సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి తరలించారు.
Also Read: ఐపీఎల్ వేలంలో అన్‌సోల్డ్‌గా మిగిలిన స్టార్ ఆటగాళ్లు
ఇక అదే రోజు రాత్రి తనపై కస్టడీలో థర్డ్ డిగ్రీ ప్రయోగించి హత్యాయత్నానికి పాల్పడ్డారని ఈ ఏడాది జూలై 11న గుంటూరు నగరం పాలెం పోలీస్ స్టేషన్‌లో రఘురామ ఫిర్యాదు చేశారు. ఇందులో భాగంగానే అప్పటి సీఎం జగన్‌తో పాటు అప్పటి సీఐడీ చీఫ్ పీవీ సునీల్‌కుమార్, సీఐడీ అదనపు ఎస్పీ ఆర్ విజయ్‌పాల్, నిఘా విభాగం అధిపతి పీఎస్‌ఆర్ ఆంజనేయులు, జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతి తదితరులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Also Read: ఊహించని రేంజ్‌లో ఐపీఎల్ బిజినెస్.. మూడు రెట్లు పెరిగిన పెట్టుబడి!
ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ విజయ్‌పాల్ హైకోర్టును అభ్యర్థించాడు. కోర్టు ఆయన అభ్యర్థనను తిరస్కరించింది. దీంతో మళ్లీ అక్టోబరు 1న ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగానే తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు చర్యలు తీసుకోవద్దని తెలిపింది. ఇక సోమవారం అదే పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు ఇరుపక్షాల వాదనలు వినింది. ఆపై విజయ్‌పాల్ పిటిషన్‌ను కొట్టివేసింది.