/rtv/media/media_files/2025/02/03/8nNqkDGDCDV5cJWIdlUi.webp)
Tirupati Municipal Corporation
Tirupati Municipal Corporation : ఏపీలోని మూడు మున్సిపాలిటీలకు, మూడు కార్పొరేషన్‌లకు డిప్యూటీ మేయర్‌లతో పాటు నాలుగు మున్సిపాలిటీల్లో వైస్ చైర్మన్ పదవులకు నేడు ఎన్నికలు జరగనున్నాయి.ఇందుకోసం ఆయా కార్పోరేషన్లు, మున్సిపాలిటీల్లో ఉదయం 11గంటలకు కౌన్సిల్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేశారు. అయితే ఈ ఎన్నికలను అధికార కూటమి, వైసీపీ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఎన్నికల్లో ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నిక ఉత్కంఠగా మారింది.
Also Read: Vijay Sethupathi: తమిళంలో పాన్ కార్డు మార్చాలి.. స్టార్ హీరో రిక్వెస్ట్ .. ఎందుకిలా?
ఈ రోజు ఉదయం ఎస్వీయూ సెనెట్ హాల్లో పరోక్ష పద్ధతిలో డిప్యూటీ మేయర్ ఎన్నికను నిర్వహించనున్నారు. ఈ ఎన్నికలో ఎలాగైనా గెలవాలని కూటమి నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. వైసీపీకి సంఖ్యాబలం ఉన్నప్పటికీ వారిలో కొంతమంది టీడీపీ గూటికి చేరినట్లు తెలుస్తోంది. వైసీపీ సీనియర్ నేత, తిరుపతి మాజీ శాసనసభ్యుడు కరుణాకర్ రెడ్డి కుమారుడు భూమన అభినయ్ రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన డిప్యూటీ మేయర్ పదవి తిరిగి దక్కించుకొనేందుకు వైసీపీ ప్రయత్నాలు చేస్తోంది. డిప్యూటీ మేయర్ పదవి తిరిగి దక్కించుకోవాలంటే కనీసం 26 మంది కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యుల మద్దతు అవసరం ఉంది. ఇప్పటకే వైసీపీ కార్పొరేటర్లు ఆ పార్టీ విప్ జారీ చేసింది. అయితే వైసీపీకి చెందిన పలువురు కార్పొరేటర్లు కూటమివైపు మొగ్గు చూపుతున్నారు.
Also Read: ANUJA: ఓటీటీలో ఆస్కార్ నామినేటెడ్ షార్ట్ ఫిల్మ్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
కాగా నిన్న రాత్రే పలువురు కార్పొరేటర్లు తిరుపతి టీడీపీ నేత భాస్కర్ కు చెందిన హోటల్‌లో బసచేశారు. అయితే తమ కార్పొరేటర్లను బలవంతంగా నిర్భందించారని ఆరోపిస్తూ భూమన అభినయ్ రెడ్డి హోటల్ వద్ద ఆందోళనకు దిగారు. దీంతో టీడీపీ,కూటమి నాయకుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. కార్పొరేటర్లను తనతో తీసుకెళ్లేందుకు భూమన ప్రయత్నించడంతో టీడీపీ నేతలు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకురావడంతో ఉద్రిక్తత సద్దుమణిగింది. అదే క్రమంలో భూమన వైసీపీ కార్పొరేటర్లను తన ఇంటికి తరలించారు. కాగా 11 గంటలకు జరిగే ఎన్నికకు వారు నేరుగా సమావేశ మందిరానికి చేరుకోనున్నారు.ప్రస్తుతం తిరుపతి కార్పొరేషన్‌లో 50 డివిజన్లలో 47 మంది కార్పొరేటర్లు ఉండగా తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం ఎక్స్‌అఫిషియో సభ్యులుగా వ్యవహరిస్తున్నారు.
Also Read : జయలలిత ఆస్తులు తమిళనాడు ప్రభుత్వానికే... సీబీఐ స్పెషల్ కోర్టు తీర్పు!
మరోవైపు రాష్ర్ట వ్యాప్తంగా తమ కార్పొరేటర్లను కూటమి నేతలు బయపెడుతున్నారని, బలవంతంగా నిర్భందిస్తున్నారని వైసీపీ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. నిజానికి తిరుపతిలో టీడీపీనుంచి ఒకే ఒక కార్పొరేటర్ విజయం సాధించాడు. అయితే మొన్నటి ఎన్నికల్లో వైసీపీ ఓటమిపాలు కావడం, కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టడంతో వైసీపీపై వ్యతిరేకతను గమనించిన పలువురు వైసీపీ కార్పొరేటర్లు ఎన్నికలకు ముందే టీడీపీలో చేరారు. వీరితో పాటు మరో పదిమంది వైసీపీ కార్పొరేటర్లు కూడా టీడీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో నేటి ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది. అయితే వైసీపీ డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన శేఖర్ రెడ్డి సైతం పార్టీ వీడే పరిస్థితి నెలకొనడంతో వైసీపీ ఎటు తేల్చుకోలేకపోతుంది. కార్పొరేటర్లు వైసీపీ శిభిరంలో ఉన్నప్పటికీ ఓటింగ్ సమయంలో ఎటు మొగ్గు చూపుతారనే విషయంలో సందిగ్ధత నెలకొంది. మరికొద్ది గంటల్లోనే డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో ఉత్కంఠకు తెరపడనుంది.
Also Read : Delhi Poll Prediction: ఢిల్లీలో గెలిచేది ఆ పార్టీయే.. ప్రీపోల్ సర్వేలో సంచలన విషయాలు