/rtv/media/media_files/2025/08/10/avinash-2025-08-10-16-01-53.jpg)
పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలు ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో కాక రేపుతున్నాయి. ఈ ఎన్నికలు ఇటు ప్రతిపక్ష వైసీపీ, అటు అధికార కూటమికి ప్రతిష్టాత్మకంగా మారాయి. పులివెందుల జెడ్పీటీసీ సభ్యుడు మహేశ్వర్ రెడ్డి, ఒంటిమిట్ట జెడ్పీటీసీ సభ్యురాలు రాజేశ్వరి మరణం కారణంగా ఈ రెండు చోట్లా ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. పులివెందుల వైసీపీకి, మాజీ సీఎం జగన్ కుటుంబానికి కంచుకోట. గత 40 ఏళ్లుగా ఈ నియోజకవర్గం నుంచి వైఎస్సార్ కుటుంబసభ్యులే గెలుస్తూ వస్తున్నారు. ఈ స్థానాన్ని కోల్పోకూడదని వైసీపీ గట్టిగా ప్రయత్నిస్తోంది. అదే సమయంలో, ఈ స్థానంలో వైసీపీ ఆధిపత్యాన్ని దెబ్బతీయాలని టీడీపీ కూటమి కూడా పట్టుదలగా ఉంది. రెండు నియోజకవర్గాల్లోనూ పార్టీల మధ్య హోరాహోరీ పోరు జరుగుతోంది.
బరిలో తుమ్మల హేమంత్ రెడ్డి
పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికకు వైసీపీ నుంచి తుమ్మల హేమంత్ రెడ్డి బరిలో ఉన్నారు. కూటమి నుంచి మారెడ్డి లతా రెడ్డి బరిలో నిలిచారు. ఈమె టీడీపీ పులివెందుల ఇన్‌ఛార్జి, మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి భార్య. కడప జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాల్లో ఏడింటిని గెలుచుకున్న టీడీపీ కూటమి, పులివెందులలో విజయం సాధించడం ద్వారా వైసీపీ కంచుకోటలో కూడా తమ ఉనికిని చాటుకోవాలని చూస్తోంది. టీడీపీ కూటమిలో కీలక నేతలందరూ ప్రచారంలో పాల్గొంటున్నారు. వైఎస్ కుటుంబానికి పులివెందులలో ఉన్న ఆదరణ, మహేశ్వర్ రెడ్డి మరణం వల్ల కలిగిన సానుభూతిని తమకు అనుకూలంగా మార్చుకోవడానికి వైసీపీ ప్రయత్నిస్తోంది. కడప ఎంపీ వై.ఎస్. అవినాష్ రెడ్డి ప్రచార బాధ్యతలు చేపట్టి, విస్తృతంగా పర్యటిస్తున్నారు.
ఈ క్రమంలో వైసీపీకి ఊహించని షాక్ తగిలింది. ఎన్నికల సంఘం బిగ్ షాక్ ఇచ్చింది. జనరల్ ఏజెంట్ గా ఎంపీ అవినాష్ కు నో చెప్పి.. మాజీ మంత్రి రామసుబ్బారెడ్డికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గన్ మెన్ ఉన్న వాళ్లకు జనరల్ ఏజెంట్ గా ఉండకూడదని ఎన్నికల నిబంధనలున్నాయి. అంతేకాకుండా పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ప్రచారానికి చివరి రోజు కావడంతో ర్యాలీ కోసం పోలీసులు అనుమతిచ్చారు. ఈ రోజు ర్యాలీలో కేవలం వైసీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డికి మాత్రమే పోలీసులు అనుమతి ఇచ్చారు. ఎంపీ అవినాష్ ర్యాలీలో పాల్గొనడానికి నిరాకరించారు. దీంతో పులివెందులలో వైసీపీ ర్యాలీ ఉంటుందా లేదా కార్యకర్తలు సందిగ్ధంలో ఉన్నారు.
ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నిక కూడా
మరోవైపు ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నిక కూడా పులివెందుల మాదిరిగానే రెండు ప్రధాన పార్టీలకు ముఖ్యమైనదిగా మారింది. అభ్యర్థుల ఎంపికలో రెండు పార్టీలు మొదట ఇబ్బందులు పడ్డప్పటికీ, ఇప్పుడు పూర్తిస్థాయిలో ప్రచారంలో నిమగ్నమయ్యాయి. టీడీపీ తరపున మంత్రులు రామప్రసాద్ రెడ్డి, నారా లోకేష్, నందమూరి బాలకృష్ణ వంటి నేతలు ప్రచారంలో పాల్గొంటున్నారు. వైసీపీ తరపున ఎమ్మెల్యేలు ఆకేపాటి అమరనాథ్ రెడ్డి, దాసరి సుధ, ఎంపీ ఎం. రఘునాథ్ రెడ్డి ప్రచారం చేస్తున్నారు. ఈ ఉప ఎన్నికల పోలింగ్ ఆగస్టు 12న జరుగుతుంది. ఆగస్టు 14న ఫలితాలు వెలువడతాయి. ఈ ఎన్నికల ఫలితాలు వైఎస్సార్‌సీపీ, టీడీపీ కూటమిలకు కేవలం జెడ్పీటీసీ స్థానాల వరకే పరిమితం కాకుండా, రాబోయే రోజుల్లో కడప జిల్లా రాజకీయాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపనున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.