/rtv/media/media_files/2025/08/21/chandrababu-2025-08-21-15-37-46.jpg)
చాలా మంది ఎమ్మెల్యేలు వ్యక్తిగత ఇమేజ్‌తో గెలిచామనుకుంటున్నారని, అలాంటివాళ్లు నిరభ్యంతరంగా బయటికి వెళ్లి పోటీ చేయొచ్చు అంటూ పార్టీ నేతలపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. సిద్ధాంతాలపై అవగాహన లేనివారికి టికెట్లిస్తే తిరువూరులాంటి పరిస్థితులే ఎదురవుతాయన్నారు. పార్టీ అండ లేకపోతే వారి పరిస్థితేంటో అప్పుడు అర్థమవుతుందని చెప్పారు. శుక్రవారం టీడీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన చంద్రబాబు సుమారు 4 గంటలు అక్కడే గడిపి పార్టీ నేతలతో వివిధ అంశాలపై ఆయన చర్చించారు.
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గ వివాదంపై సీఎం ఫైర్ అయ్యారు. ఈ వ్యవహారంలో ఎమ్మెల్యే కొలికపూడి, విజయవాడ కేశినేని శివనాథ్ (చిన్ని)ని పిలిపించాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును సీఎం చంద్రబాబు ఆదేశించారు. క్రమశిక్షణ కమిటీ ముందుకు విడివిడిగా రప్పించి వివరణ తీసుకోవాలన్నారు. అంతేకాకుండా దానిపై సీఎం చంద్రబాబు నివేదిక కోరారు. తన విదేశీ పర్యటన ముగించుకుని వచ్చాక ఇద్దరితోనూ మాట్లాడతానని సీఎం చెప్పారు. ఒకవేళ విభేదాలు కొలిక్కిరాకుంటే కఠిన చర్యలకు వెనుకాడనని సీఎం హెచ్చరించారు. ఎవరైనా సరే పార్టీ టికెట్ ఇచ్చిన తర్వాత పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేయాలని, పార్టీ లైన్ దాటితే ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు.
ఆచితూచి మాట్లాడాలి
ఇక ఎమ్మెల్యే ఎంఎస్ రాజు.. భగవద్గీతపై వ్యాఖ్యలు చేశారంటూ జరుగుతున్న ప్రచారంపైనా సీఎం చంద్రబాబు స్పందించారు. ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు ఆచితూచి మాట్లాడాలని, వారు మాట్లాడే మాటలు రాష్ట్రం మొత్తం మీద, పార్టీపై కూడా ప్రభావం చూపుతాయని సీఎం సూచించారు. ఇక పార్టీ కార్యకర్తలను సుశిక్షితులుగా తయారు చేయడంపై దృష్టి సారించాలని పార్టీ నేతలకు చంద్రబాబు సూచించారు. కేవలం రాజకీయాల్లోకి రావడం అంటే డబ్బు సంపాదన కోసమేనన్న ఆలోచనను తుడిచివేయాలన్నారు. అలాంటి వాళ్లు వేరేమార్గం చూసుకోవాలన్నారు. ప్రజాసేవకే అయితేనే రాజకీయాల్లోకి రావాలని, ఈ దిశగా క్యాడర్‌కు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు.
లిక్కర్ బిజినెస్ లో ఎక్కువ మంది రాజకీయ నాయకులు ఉంటున్నారని, దానిద్వారా సంపాదించిన డబ్బు నిలవదన్నారు చంద్రబాబు.. గత ప్రభుత్వ హయాంలో లిక్కర్ స్కామ్ కేసు అందుకు చక్కటి ఉదాహరణ అని చెప్పుకొచ్చారు. వారంలో ఒకరోజు పార్టీ కార్యాలయానికి కేటాయిస్తానని, ప్రభుత్వపరంగా, పార్టీ పరంగా రెండింటికీ సమయం కేటాయిస్తానని చంద్రబాబు తెలిపారు..
Follow Us