ఆంధ్రప్రదేశ్ రెండు కళ్ల లాంటి పోలవరం, అమరావతిలను నిర్లక్ష్యం చేసి రాష్ట్రాన్నే అంధకారంలోకి నెట్టారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. గత ప్రభుత్వ పాలనలో మొత్తం విధ్వంసం జరిగిందని పోలవరంలో సీఎం చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో ఒక్కోసారి ఏం చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. 2019లో టీడీపీ ప్రభుత్వం కొనసాగి ఉంటే 2021 కి పోలవరం ప్రాజెక్ట్ పూర్తయ్యుండేదని ఆయన చెప్పారు. 2026 అక్టోబర్ నాటికల్లా పోలవరం పూర్తిగా కంప్లీట్ చేయడానికి యాక్షన్ ప్లాన్ తయారు చేశామని బాబు వివరించారు. పోలవరం నిర్మాణంపై నిపుణుల రిపోర్టుపై కేంద్రం వద్దకు వెళ్లామన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో దీన్ని కంప్లీట్ చేయాల్సిన అవసరం ఏర్పడింది. పోలవరానికి రూ.12,157 కోట్లు శాంక్షన్ చేశారు. రూ.2,300 కోట్లు విడుదల చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. చంద్రబాబు మీడియాలో సమావేశంలో మాట్లాడుతూ.. పీపీఏ, నిపుణులు, సీడబ్ల్యూసీ వాళ్లు 3 రోజులపాటు వర్క్ షాప్ నిర్వహించారు. సమాంతరంగా డయాఫ్రం వాల్, ఎర్త్ కమ్ రాక్‌ఫిల్ (ఈసీఆర్ఎఫ్) డ్యాం పనులు పారంభమైతాయి. దెబ్బతిన్న డయాఫ్రం వాల్ స్థానంలో కొత్త డయాఫ్రం వాల్ నిర్మిస్తామని అన్నారు. జనవరి 2వ తేదీన కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణ పనులు స్టార్ట్ చేస్తామన్నారు. 2025 డిసెంబర్ నాటికి డయాఫ్రం వాల్ పూర్తి కావాలని ఆదేశించారు. 2025 డిసెంబర్ 10న ఈసీఆర్ఎఫ్ డ్యాం-1 పనులు ప్రారంభమై.. 2026 ఫిబ్రవరి నాటికి పనులు పూర్తి కానున్నాయని తెలిపారు. 2026 మే-జూలై లోపు పోలవర్ కంప్లీట్ చేస్తే ఒక సీజన్ కలిసి వస్తుందని చెప్పారు. 2026 నుంచే నీటిని స్టోరేజీ చేసుకునే పరిస్థితి రావాలని అధికారులకు చెప్పారు. ఛానల్ పెండింగ్ పనులు 2026 జూన్ లోగా పూర్తవ్వాలి. స్పిల్ ఛానల్ పెండింగ్ పనులు, ఎడమ కాలువ కనెక్టివిటీ పరిధిలో హెడ్ రెగ్యులేటర్ పనులు, ఇరిగేషన్ టన్నెల్ పనులు 2027 ఫిబ్రవరిలోగా పూర్తి చేయాలని సూచించారు. మొత్తం 16,450 ఎకరాల భూసేకరించి.. ఆర్ అండ్ ఆర్ కూడా 2026 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంతో ఉన్నామని ముఖ్యమంత్రి అన్నారు. ఈ పనులన్నీ 2025 ఏప్రిల్ 25 నాటికి పూర్తి చేయాలని చెప్పారు. కేంద్రం దృష్టికి తీసుకెళ్లి పోలవరం టైమ్ షెడ్యూల్‌ను వివరిస్తామని చెప్పారు. 2026 అక్టోబర్ నాటికల్లా పోలవరం పూర్తి చేయాలని టార్గెట్ తో ప్రభుత్వం ఉందని అన్నారు. క్లియరెన్సెస్ విషయంలో ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందించాలని చెప్పారు. దేశ చరిత్రలో ఒక ప్రాజెక్టును 28 సార్లు సందర్శించిన ఏకైక ముఖ్యమంత్రి తానే అని చంద్రబాబు అన్నారు. దేశంలోనే నెంబర్ వన్ తలసరి ఆదాయం గల రాష్ట్రం తెలంగాణ అని మీడియా సమావేశంలో చెప్పుకొచ్చారు.