/rtv/media/media_files/2026/02/07/porn-2026-02-07-15-43-01.jpg)
స్మార్ట్‌ఫోన్ మాయలో పడి యూత్ తమ బంగారు భవిష్యత్తును బుడిద చేసుకుంటున్నారు. ముఖ్యంగా చైల్డ్ పోర్న్ చూడటం, వాటిని ఇతరులకు షేర్ చేయడం వంటి పనులతో తెలియకుండానే కటకటాల పాలవుతున్నారు. ఇటీవల విజయవాడ నగరంలో ఇలాంటి కేసులు ప్రమాదకరంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
10 నుండి 16 ఏళ్ల వయసున్న విద్యార్థులు, యువకులు ఇంటర్నెట్లో బ్రౌజ్ చేస్తున్నప్పుడు వచ్చే చిన్న చిన్న ప్రకటనలు వారిని అశ్లీల ప్రపంచంలోకి లాగుతున్నాయి. ఒకసారి చూద్దాంలే అని మొదలుపెట్టి, చివరికి దానికి బానిసలుగా మారుతున్నారు. గతేడాది ఒక్క విజయవాడలోనే ఇలా చైల్డ్ పోర్న్ చూస్తూ, షేర్ చేస్తూ దొరికిపోయిన 678 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఈ వీడియోలను కేవలం చూడటమే కాదు, మన ఫోన్లో సేవ్ చేసుకున్నా లేదా ఇతరులకు వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లో పంపినా అది తీవ్రమైన నేరం. చిన్నారుల అశ్లీల చిత్రాలు తీసినా, అప్లోడ్ చేసినా మొదటిసారి దొరికితే 5 ఏళ్ల జైలు శిక్ష, రూ. 10 లక్షల జరిమానా విధిస్తారు. రెండోసారి దొరికితే 7 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. కొత్త చట్టం (BNS 67)ప్రకారం కూడా నిందితులకు 3 నుండి 7 ఏళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది.
నేను చూసేది ఎవరికి తెలుస్తుందిలేనని అనుకుంటే పొరపాటే. ఢిల్లీలోని ఎన్‌సీఎంఈసీ వంటి సంస్థలు, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఇంటర్నెట్పై గట్టి నిఘా ఉంచాయి. ఎవరైనా ఇలాంటి కంటెంట్‌ను శోధించినా లేదా షేర్ చేసినా, వారి IP అడ్రస్ ఆధారంగా పోలీసులు నిమిషాల్లో కనిపెట్టేస్తారు.
పిల్లలు ఫోన్లలో ఏం చూస్తున్నారో
విజయవాడలో ఓ యువకుడు ఇన్‌స్టాగ్రామ్‌లో చైల్డ్ పోర్న్ వీడియోను తన స్నేహితుడికి పంపగా, ఢిల్లీలోని నిఘా సంస్థ ఆ సమాచారాన్ని పోలీసులకు పంపింది. ఫలితంగా ఆ యువకుడిపై కేసు నమోదై ప్రస్తుతం కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడు. పిల్లలు ఫోన్లలో ఏం చూస్తున్నారో గమనించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంది. కేవలం సరదా కోసం చేసే పనులు వారి కెరీర్‌ను నాశనం చేస్తాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఒక్కసారి కేసు నమోదైతే ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులు కావడమే కాకుండా, సమాజంలో తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది.
Follow Us