/rtv/media/media_files/2025/08/09/pulivendula-zptc-by-election-2025-08-09-16-58-20.jpg)
Pulivendula ZPTC
Pulivendula ZPTC : రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తిని రేపిన వైఎస్సార్ జిల్లాలోని పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాలకు ఉప ఎన్నిక ముగిసింది. మంగళవారం నిర్వహించిన పులివెందుల, ఒంటిమిట్ల జడ్పీటీసీ ఎన్నికలు అధ్యంతం రసవత్తరంగా సాగాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలతో రోజంతా ఉత్కంఠను రేకెత్తించింది. పలు చోట్ల టీడీపీ, వైసీపీ శ్రేణులు ఘర్షణలు దిగాయి. అనేక కేంద్రాల్లో టీడీపీ నాయకులు వైసీపీ వారిని అడ్డుకున్నారనే ఆరోపణలు కూడా వచ్చాయి. ఇదిలా ఉండగా ఉప ఎన్నికకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. రెండు కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని ఏపీ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. 3, 14 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ చేయాలని రాష్ట్రఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) ఆదేశాలు జారీ చేసింది. దీంతో బుధవారంఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ రెండు కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించనున్నారు. 3, 14 పోలింగ్ కేంద్రాల పరిధిలో మొత్తం వెయ్యి మంది ఓటర్లు ఉన్నారని తెలుస్తోంది.
పులివెందుల, ఒంటిమిట్ట స్థానాలను కూటమి, వైసీపీ పార్టీలు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. పులివెందుల మాజీ ముఖ్యమంత్రి జగన్ సొంత నియోజకవర్గం కావడంతో వైసీపీకి ఈ ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ నియోజకవర్గంలో గడచిన మూడు దశాబ్ధాలుగా ఏనాడు ఎన్నికలు జరగలేదు. ప్రతిసారి ఏకగ్రీవంగానే ఎన్నికలు జరుగుతున్నాయి, అయితే ఈసారి రాష్ర్టంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండటంతో ఈ స్థానాన్ని ఎలాగైన గెలుచుకోవాలని నిర్ణయించింది. దీంతో టీడీపీ నియోజక వర్గ ఇన్‌చార్జ్ బీటెక్ రవి సతీమణి లతారెడ్డి కి టికెట్ కేటాయించింది. ఇక వైసీపీ నుంచి దివంగత జడ్పీటీసీ మహేశ్వర రెడ్డి కుమారుడు హేమంత్ రెడ్డి బరిలో నిలిచారు. కాగా మంగళవారం జరిగిన ఎన్నికల్లో పులివెందులలో 76.44 శాతం, ఒంటిమిట్టలో 81.53 శాతం ఓటింగ్ నమోదైంది. ఈ నెల 14న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. పులివెందులలో మొత్తం 11 మంది అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ, మారెడ్డి లతారెడ్డి, హేమంత్‌రెడ్డి మధ్యే ప్రధాన పోటీ నెలకొంది.
పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్‌లో టీడీపీ అరాచకాలకు పాల్పడిందని వైఎస్సార్‌సీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. అదే సమయంలో మొదటిసారి పులివెందులలో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిగాయని టీడీపీ ప్రకటించింది. అయితే రెండు పార్టీల నాయకుల తీరుతో చాలామంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోలేకపోయారని, అందువల్ల రీ–పోలింగ్ నిర్వహించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. పోలింగ్ సందర్భంగా పలు పోలింగ్ కేంద్రాల్లో వాస్తవ ఓటర్లను కాదని ఆయా పార్టీల నాయకులే ఓట్లు వేశారన్న ఆరోపణలు వినవస్తున్నాయి. ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకుని వెళ్లేందుకు ఇండిపెండెంట్‌అభ్యర్థులు సిద్ధమయ్యారు. ఈ విషయం తేలేందుకు14వ తేదీన ఎన్నికల కౌంటింగ్ నిలిపివేయాలని కోరారు. రెండు పార్టీల తీరుతో ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోలేకపోయారని పలువురు ఆరోపించారు.
రెండు పార్టీలు ఇష్టారాజ్యంగా రిగ్గింగ్‌కు పాల్పడ్డాయని స్వతంత్ర అభ్యర్థులు ఆరోపించారు. పోలింగ్‌కు ముందే బయటి ప్రాంతాల నుంచి వందల సంఖ్యలో గూండాలను పోలింగ్ కేంద్రాలు ఉన్న గ్రామాల్లో మోహరించారని వివరించారు. దీని మీద పదే పదే ఫిర్యాదు చేసినప్పటికీ, ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. ప్రజలు ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు రాకుండా పలువురు అడ్డుకున్నారని వెల్లడించారు. ఓటర్లను సైతం ఓటు హక్కు వినియోగించుకోకుండా నిరోధించారన్నారు. పులివెందుల జెడ్పీటీసీ పరిధిలోని 15 పోలింగ్ కేంద్రాల్లో రిగ్గింగ్ జరిగిందని పలువురు ఆరోపించారు. దీంతో ఈ కేంద్రాల్లో రీ పోలింగ్ నిర్వహించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
ఇది కూడా చదవండి:ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యాన్ లోయలో పడి 8 మంది మహిళలు మృతి