APSRTC : రెండు రాష్ట్రాల్లో రేపటి నుంచి పాఠశాలలకు, కాలేజీలకు దసరా సెలవులను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఏపీఎస్ ఆర్టీసీ ప్రయాణీకుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక సర్వీసులను నడపనున్నట్లు ప్రకటించింది. పండుగ నేపథ్యంలో 6,100 ప్రత్యేక సర్వీసులను నడుపుతున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ తాజాగా ఓ ప్రకటన చేసింది.
ఏపీలోని ఇతర జిల్లాలు, తెలంగాణ, చెన్నై, బెంగళూరు ప్రాంతాల నుండి వచ్చే ప్రయాణీకుల కోసం ప్రత్యేక బస్సు సర్వీసులను నడపనున్నట్లు పేర్కొంది. ప్రయాణీకుల రద్దీని దృష్టిలో పెట్టుకుని అక్టోబర్ 4నుండి 20వ తేదీ వరకూ మొత్తం 6,100 సర్వీసులను నడిపేందుకు ప్రణాళిక సిద్దం చేసినట్లు ఏపీఎస్ఆర్టీసీ తెలిపింది.
అక్టోబర్ 4 నుండి 11 వరకూ దసరా ముందు 3,040 లు, అక్టోబర్ 12 నుండి 20వ తేదీ వరకూ దసరా తర్వాత మరో 3,060 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు తెలిపింది. అయితే ఈ ఏడాది ఆర్టీసీ ప్రయాణీకులకు మరో శుభవార్త చెప్పింది. ప్రయాణీకులపై ఎలాంటి భారం పడకుండా ఈ ప్రత్యేక సర్వీసుల్లోనూ సాధారణ ఛార్జీలనే వసూలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. అంతే కాకుండా ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కల్పించడంతో పాటు రానుపోను టికెట్ బుకింగ్ చేసుకున్న వారికి టికెట్ ధరలో పది శాతం రాయితీ ఇవ్వనున్నట్లు కూడా తెలిపింది.
హైదరాబాద్, విజయవాడ, తిరుపతి మధ్య నడిచే ఏసీ బస్సుల్లోనూ టికెట్ చార్జీలపై పది శాతం రాయితీ అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
Also Read: మియాపూర్ లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని దారుణ హత్య!