విజయనగరం స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. తాడేపల్లిలోని జగన్ నివాసానికి వెళ్లిన వైసీపీ నాయకులు జిల్లాకు రాకముందే ఆ పార్టీకి ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. గతంలో ఎమ్మెల్సీగా ఉన్న రఘురాజుపై మండలి చైర్మన్ మోషన్ రాజు వేసిన అనర్హత వేటును హైకోర్టు రద్దు చేసింది. అనర్హత వేటుపై గతంలోనే ఇందుకూరి రఘురాజు హైకోర్టును ఆశ్రయించారు. అయితే.. న్యాయస్థానం నేడు ఈ అంశంపై తుది విచారణ నిర్వహించింది. ఆయనపై వేసిన అనర్హత వేటు చెల్లదని స్పష్టం చేసింది. దీంతో 2027 నవంబర్ 31 వరకు ఆయన ఎమ్మెల్సీగా కొనసాగనున్నారు.
Also Read: మేఘాకు బిగ్ షాక్.. ఆ రిజర్వాయర్ కాంట్రాక్ట్ రద్దు!
ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికకు నోటిఫికేషన్..
అయితే రఘురాజుపై వేటు పడడంతో ఎన్నికల సంఘం ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 28న ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ నెల 11 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన్నప్పలనాయుడును ప్రకటించింది. అయితే.. ఇప్పుడు రఘురాజుపై ఉన్న అనర్హత వేటు చెల్లదని ఇప్పుడు హైకోర్టు తీర్పు ఇవ్వడం తీవ్ర చర్చనీయాంశమైంది.
ఎన్నికల సంఘం ఈ అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. అయితే.. విజయనగరం స్థానిక సంస్థల ఎన్నికను ఈసీ రద్దు చేసే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అయితే.. ఎన్నికల సంఘం ఇచ్చిన షెడ్యూల్ ను సైతం రద్దు చేయాలని రఘురాజు హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతోంది.
Also Read: పవన్ Vs స్టాలిన్.. దక్షిణాదిలో బీజేపీ బిగ్ స్కెచ్!
విశాఖ ఎన్నికల్లో విజయంతో..
ఇటీవల జరిగిన విశాఖ స్థానిక సంస్థ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇదే ఊపుతో విజయనగరంలోనూ విజయం సాధించి మండలిలో బలం పెంచుకోవాలని వైసీపీ భావించింది. స్థానిక సంస్థల్లో వైసీపీకి మెజార్టీ ఉంది. దీంతో తమ గెలుపు ఖాయమని ఆ పార్టీ లెక్కలు వేసుకుంది. కానీ ఊహించని విధంగా హైకోర్టు తీర్పు రావడంతో ఆ పార్టీ నేతలు షాక్ కు గురైనట్లు తెలుస్తోంది.