/rtv/media/media_files/2025/09/20/cm-chandrababu-2025-09-20-14-59-17.jpg)
ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, నీటి పంపకాల విషయంలో తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై కీలక వ్యాఖ్యలు చేశారు. గోదావరి నదిలో పుష్కలంగా నీరు ఉందని, సముద్రంలో కలిసే నీటిని ఎవరైనా వాడుకోవచ్చని చంద్రబాబు పేర్కొన్నారు. "పోలవరం ప్రాజెక్టుకు అభ్యంతరం చెప్పడం సరికాదు. నీటి విషయంలో రాజకీయాలు చేయవద్దని తెలంగాణ నేతలను కోరుతున్నాను. మనం విరోధాలు పెంచుకుని ఇతరులు ఆనందించేలా ప్రవర్తించకూడదు" అని ఆయన హితవు పలికారు. దేవాదుల, కల్వకుర్తి ప్రాజెక్టులను తానే ప్రారంభించానని గుర్తు చేస్తూ, ఎగువన ఉన్న దేవాదుల నుంచి నీరు వస్తేనే పోలవరానికి అందుతుందని, దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేయడంలో అర్థం లేదన్నారు. తెలంగాణ ప్రజల కోసం రాజకీయాలు చేస్తే మంచిదని.. నీళ్లపై కాదని తెలంగాణ నాయకులకు చంద్రబాబు సూచించారు.
YCP వల్లే ప్రాజెక్టు ఆలస్యం
పోలవరం ప్రాజెక్టు ఆలస్యానికి గత వైకాపా ప్రభుత్వమే కారణమని చంద్రబాబు ధ్వజమెత్తారు. "గత ప్రభుత్వ అసమర్థత వల్ల పోలవరం ఆరేడేళ్లు వెనక్కి వెళ్లింది. డయాఫ్రం వాల్ దెబ్బతినడం వల్లే ఈ దుస్థితి వచ్చింది. ఐఐటీ హైదరాబాద్ నిపుణుల సూచన మేరకు భవిష్యత్తు విపత్తులను తట్టుకునేలా కొత్త డయాఫ్రం వాల్ నిర్మిస్తున్నాం. ఫిబ్రవరి 15 కల్లా ఈ పనులు పూర్తి చేస్తాం" అని స్పష్టం చేశారు. వైకాపా కూల్చేసిన వ్యవస్థలను తాము తిరిగి గాడిలో పెడుతున్నామని ఆయన అన్నారు.
రాయలసీమ ఎత్తిపోతల
రాయలసీమ ఎత్తిపోతల పథకంపై జరుగుతున్న ప్రచారంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం అనుమతులు లేని ప్రాజెక్టులు ప్రారంభించి ప్రజల సొమ్ము రూ. 2,000 కోట్లు వృధా చేసిందని, ఫలితంగా ఎన్జీటీకి రూ. 100 కోట్ల జరిమానా చెల్లించాల్సి వచ్చిందని విమర్శించారు. ముచ్చుమర్రి ద్వారా నీటిని తెచ్చుకునే అవకాశం ఉన్నా, అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు.
కృష్ణా డెల్టాను కాపాడి, గోదావరి జలాలను అనుసంధానం చేయడం ద్వారా రెండు రాష్ట్రాలకు లబ్ధి చేకూరుతుంది. వైకాపా హయాంలో జరిగిన అక్రమాలపై దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడి. తెలుగు జాతి ఒక్కటేనని, భావోద్వేగాలతో ఆటలాడటం మంచిది కాదని సూచన. ఈ కార్యక్రమంలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మరియు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Follow Us