/rtv/media/media_files/2025/10/24/family-2025-10-24-09-09-39.jpg)
కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శుక్రవారం తెల్లవారుజామున హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారి 44పై ప్రయాణిస్తున్న వేమూరి కావేరి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగడంతో భారీ సంఖ్యలో ప్రయాణికులు సజీవదహనమయ్యారు.శుక్రవారం తెల్లవారుజామున 3:00 నుండి 3:30 గంటల మధ్య ఈ సంఘటన జరిగిందని పోలీసులు చెబుతున్నారు. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 42 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు ముందు భాగంలోకి బైక్ దూసుకెళ్లి ఢీకొట్టడంతో మంటలు చెలరేగినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది.
కర్నూలు జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది..
— RTV (@RTVnewsnetwork) October 24, 2025
హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కావేరి ట్రావెల్స్ బస్సు చిన్నటేకూరులో అగ్ని ప్రమాదానికి గురైంది..
అగ్నిప్రమాదానికి బస్సులోనే పలువురు సజీవదహనం అయ్యారు..
బస్సులో 42మంది వరకు ప్రయాణిస్తుండగా12 మంది బయటపడ్డారు..
25 మందికి… pic.twitter.com/VkArgAtWWr
బైక్ బస్సు డీజిల్ ట్యాంకును ఢీకొట్టడం వల్ల మంటలు వేగంగా వ్యాపించాయి. మృతుల్లో బైక్‌పై ప్రయాణిస్తున్న వారు కూడా ఉన్నట్లు సమాచారం. బస్సులో నిద్రిస్తున్న ప్రయాణికుల్లో కొందరు మంటలను గమనించి, బస్సు ఎమర్జెన్సీ డోర్ పగులగొట్టుకుని సుమారు 12 నుంచి 15 మంది ప్రాణాలతో బయటపడ్డారు. వీరిలో కొందరికి గాయాలు అయ్యాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు, ఫైర్ సిబ్బంది మరియు ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. తీవ్రంగా కాలిపోయిన మృతదేహాలను వెలికితీసే ప్రక్రియ కొనసాగుతోంది. గాయపడిన వారిని మెరుగైన చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
నెల్లూరుకు చెందిన కుటుంబం మృతి
అయితే ఈ బస్సు ప్రమాదంలో నెల్లూరుకు చెందిన ఓ కుటుంబం మృతి చెందింది. గోళ్ల రమేష్ కుటుంబం మృతి చెందినట్లుగా బంధువులు వెల్లడించారు. నెల్లూరు జిల్లా వింజమూరు మండలం గోళ్లవారిపల్లికి చెందిన చెందిన గోళ్ల రమేశ్ (35), అనూష(30), శశాంక్ (12), మాన్యత (10) సజీవదహనం అయ్యారు. బస్సు నుంచి 11 మృతదేహాలు వెలికి తీశామని కలెక్టర్ సిరి తెలిపారు.
ఈ దుర్ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు అవసరమైన అన్ని రకాల వైద్య సహాయం అందించాలని, ఘటనపై తక్షణమే ఉన్నత స్థాయి విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు. ప్రమాద ఘటనపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేసి, ఏపీ సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
Follow Us