AP Cabinet Meeting: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఎల్లుండి ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. ఇందులో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. దాంతో పాటూ 3నెలల కోసం అసెంబ్లీ లో ప్రవేశపెట్టనున్న ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కు కేబినెట్ ఆమోదం తెలపనుంది. నిన్న కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో ఆంధ్రాకు బోలెడు వరాలు కురిపించారు. దీనిపై సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. అమరావతికి (Amaravati) మళ్లీ మంచిరోజులు వచ్చాయనే ఆశ అందరిలో చిగురించిందన్నారు. ఇప్పటికే రాజధాని నిర్మాణం జరిగుంటే మరో మూడు లక్షల కోట్ల రూపాయల ప్రజా సంపద కూడా వచ్చి ఉండేదని చెప్పారు. గత పాలకుల వల్ల అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇక ఏపీ జీవనాడి పోలవరం 72శాతం పూర్తయింది. పోలవరాన్ని సాధ్యమైనంత తొందరలోనే పూర్తి చేస్తామని బడ్జెట్‌లో (Union Budget 2024) ఆర్థిక మంత్రి నిర్ధిష్టమైన హామీ ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ఆమెకు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. 2020-21 నాటికి పూర్తి కావాల్సిన పోలవరం ప్రాజెక్టును గోదావరిలో కలిపేశారని, కావాలని కాంట్రాక్టర్లను, అధికారులను మారుస్తూ అంతా పాడు చేశారంటూ మండిపడ్డారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, రైతులకు జీవనాడి పోలవరం. భారత ఆహార భద్రతకు ఆ ప్రాజెక్టు ఎంతో కీలకం. పోలవరం నిర్మాణం (Polavaram Project) వెంటనే జరిగేలా చర్యలు తీసుకుంటామని నిర్మల సీతారామన్ (Nirmala Sitharaman) భరోసానిచ్చారు. అలాగే ఏపీలో వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వనున్నట్లు తెలిపారు. రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు మంజూరు చేస్తామన్నారు. విభజన చట్టం ప్రకారం పారిశ్రామికాభివృద్ధికి ప్రత్యేక సహకారం అందిస్తామని, విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్‌లోని నోడ్‌లకు ప్రత్యేక సాయం చేస్తామన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి. కొప్పర్తి, ఓర్వకల్లు పారిశ్రామిక కేంద్రాలకు నీళ్లు, విద్యుత్, రోడ్లు, హైవేల అభివృద్ధికి నిధులు కేటాయిస్తామన్నారు. విశాఖ – చెన్నై కారిడార్‌లో కొప్పర్తికి, హైదరాబాద్-బెంగళూరు కారిడార్‌లో ఓర్వకల్లుకు నిధులు ఇస్తామని స్పష్టం చేశారు.
Also Read:Budget 2024: తగ్గనున్న బ్యాటరీ, ఎలక్ట్రిక్ వాహనాల ధరలు