Snowfall: ఒకవైపు భారీ వర్షాలు, మరోవైపు హిమపాతంతో అగ్ర రాజ్యం అమెరికా అతలాకుతలమవుతోంది. కాలిఫోర్నియా (California) రాష్ట్రంలో బలమైన గాలులకు తోడు రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. దీంతో రాష్ట్రంలోని ఎనిమిది కౌంటీల్లో అత్యవసర పరిస్థితిని విధిస్తున్నట్లు గవర్నర్ (Governor) ప్రకటించారు.
సురక్షిత ప్రదేశాలకు తరలింపు..
ఈ మేరకు మొత్తం 130ప్రాంతాల నుంచి వరదల సమాచారం అందిందని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. తుపాను కారణంగా దెబ్బతినడంతో పసిఫిక్ తీర హైవేను మూసివేయాలని నిర్ణయించగా.. దక్షిణాన ఉన్న పర్వతప్రాంత ప్రజలు సురక్షిత ప్రదేశాలకు వెళ్లాలని ప్రభుత్వం కోరింది. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని లాస్ ఏంజిలెస్ మేయర్ తెలిపారు. చాలా చోట్ల వీధుల్లోకి బురద కొట్టుకురాగా.. 100 చోట్ల మట్టి పెళ్లలు విరిగిపడ్డాయి. బెల్ ఎయిర్, బెవర్లీ హిల్స్ వద్ద భారీగా నష్టం జరిగినట్లు తెలుస్తోంది.
150 ఏళ్లలో తొలిసారి..
అలాగే లాస్ ఏంజిలెస్ ప్రాంతంలో గత 150 ఏళ్లలో నమోదైన తొలి ఐదు అత్యధిక వర్షపాతాల్లో ఇది ఒకటి. రెండు రోజుల్లో 6.35 అంగుళాల వర్షం కురిసింది. 1934లో పడిన 7.98 అంగుళాల వర్షపాతమే ఇక్కడ రికార్డు. అలాగే శాన్‌ఫ్రాన్సిస్కోలో చాలా చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. కొన్ని చోట్ల చెట్లు కూలిన ఘటనల్లో ముగ్గరు ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం కూడా వాతావరణం ఇలానే కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు.
ఇది కూడా చదవండి : Karnataka: మైనర్ బాలికపై హాకీ ప్లేయర్ అత్యాచారం.. పెళ్లి పేరుతో ఐదేళ్లుగా
వేల సంఖ్యలో విమానాలు రద్దు..
మరోవైపు ఇదే తుపాను లాస్‌వేగాస్, నెవాడ ప్రాంతాల్లో భారీ హిమపాతానికి కారణమైంది. లీ కెనైన్ స్కీ రిసార్ట్ వద్ద మంచు పెళ్లలు విరిగిపడ్డాయని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,90,000 గృహాలకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. కాలిఫోర్నియా, అరిజోనా, నెవాడాల్లో 3.5 కోట్ల మంది ప్రస్తుతం వరద ముప్పులో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇక మమ్మూత్ స్కీబేస్‌లో 33 అంగుళాల హిమపాతం నమోదైంది. వేల సంఖ్యలో విమానాలు రద్దు చేశారు. మరికొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి.