Ambani Wedding: రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ - రాధికా మర్చంట్ వివాహం బాంద్రా-కుర్లా కాంప్లెక్స్‌లోని జియో వరల్డ్ సెంటర్ లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ గ్రాండ్ వెడ్డింగ్ లో బాంబు ఉందంటూ ఎక్స్ లో శనివారం ఓ వ్యక్తి చేసిన ఓ అనుమానాస్పద పోస్ట్ తీవ్ర కలకలం రేపింది. దీంతో అప్రమత్తమైన ముంబై పోలీస్ అధికారులు అంబానీ పెళ్ళిలో భద్రతను పెంచారు.
బాంబు బెదిరింపు పోస్ట్
అయితే ఈ పోస్ట్ ఒక బూటకమని పోలీసులు ఊహించినప్పటికీ, పోలీసులు ఎటువంటి అవకాశం తీసుకోలేదు. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ప్రముఖులు హాజరైన ఈ వివాహ వేదిక( జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్) చుట్టూ భద్రతను పెంచారు. మరో వైపు పోలీసు బృందం అనుమానాస్పద పోస్ట్‌ను పోస్ట్ చేసిన వ్యక్తిని కనుగొనే చర్యలు చేపట్టింది. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం.. శనివారం రాత్రి ఒక X యూజర్ ముంబై పోలీసు హ్యాండిల్‌ను ట్యాగ్ చేసి, @ffsfir అనే యూజర్ చేసిన అనుమానాస్పద పోస్ట్ గురించి పోలీసులకు తెలియజేశాడు.
ఎక్స్ పోస్ట్
@ffsfir హ్యాండిల్ వినియోగదారుడు ఎక్స్ లో ఇలా పోస్ట్ చేశాడు.. “అంబానీ పెళ్లిలో బాంబు పేలితే సగం ప్రపంచం తలకిందులు అవుతుందని సిగ్గులేని ఆలోచన నా మదిలో మెదిలింది. ఒక పిన్ కోడ్‌లో ట్రిలియన్ డాలర్లు” అని పోస్ట్ చేశాడు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు వివాహ వేదిక చుట్టు భద్రతను కట్టుదిట్టం చేసినట్లు సమాచారం. ఈ అనుమానాస్పద పోస్టుకు సంబంధించి ఇంకా ఏ వ్యక్తిపైనా కేసు నమోదు కాలేదు. ఈ గుర్తు తెలియని X యూజర్ కనిపెట్టేందుకు పోలీస్ బృందం రంగంలోకి దిగింది.
ఇదిలా ఉంటే ఇప్పటికే ఆహ్వానం లేకుండానే అంబానీ పెళ్ళికి హాజరైన ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిద్దరూ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యూట్యూబర్ వెంకటేస్ అల్లూరి, వ్యాపారవేత్తగా చెప్పుకుంటున్న షఫీ షేక్‌గా పోలీసులు గుర్తించారు. వీళ్లను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లిన అనంతరం నోటీసులు ఇచ్చి వదిలేశారు. చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.